Leading News Portal in Telugu

IPL 2025 Royal Challengers Bangalore RCB Begin New Journey Under Captain Rajat Patidar


  • కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతున్న ఆర్‌సిబి
  • ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్
  • టాప్ ఆర్డర్ బ్యాటింగ్, పేస్ బౌలింగ్ సామర్థ్యం జట్టుగా కనపడుతున్నా..
  • సమస్యగా మారనున్న స్పిన్ విభాగం.
IPL 2025 RCB: ‘ఈ సాల కప్ నమ్మదే’.. కొత్త కెప్టెన్ ఆర్‌సిబి తల రాతను మార్చగలడా!

IPL 2025 RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్ తమ టీమ్ ట్రోఫీ విజయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి సీజన్‌లో మాదిరిగా ఈ సీజన్‌లో కూడా ఆర్‌సిబి జట్టుకు మద్దతుగా నిలిచేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఇకపోతే, ఈసారి ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో తన ప్రస్థానం మొదలు పెట్టనుంది.

గత సీజన్లలో ఫాఫ్ డుప్లెసీ నడిపించిన జట్టు ప్లే-ఆఫ్ వరకు చేరినప్పటికీ, ఈ సీజన్ కోసం ఆర్‌సిబి కొత్త నాయకత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఫాఫ్ డుప్లెసీని విడుదల చేసి, రజత్ పటీదార్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించడం జరిగింది. రజత్ గత కొన్ని సీజన్లలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టులో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాడు. అయితే, ఈ సీజన్‌లో అతడు కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంది.

ఆర్‌సిబి ఈ సీజన్‌లో తన జట్టును చాలా వరకు కొత్త ఆటగాళ్లతో కనపడుతోంది. గ్లెన్ మ్యాక్స్వెల్, మొహమ్మద్ సిరాజ్, ఫాఫ్ డుప్లెసీతో పాటు మరికొంతమంది కీలక ఆటగాళ్లను విడుదల చేసింది. బదులుగా లియామ్ లివింగ్ స్టన్, భువనేశ్వర్ కుమార్ వంటి కీలక ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఇందులో భువనేశ్వర్ మంచి ఎంపికగా కనిపిస్తున్నాడు. అయితే లివింగ్ స్టన్ ఎంతవరకు తన ప్రభావాన్ని చూపగలడా అన్నది ప్రశ్నే. ఈసారి ఫిల్ సాల్ట్ కూడా జట్టులో చేరాడు. అయితే, అతని ఇటీవల ఫామ్ ఎంతో ఆశాజనకంగా లేకపోవడం ఆర్‌సిబికి ఇబ్బంది కలిగించే విషయమే.

బ్యాటింగ్‌లో మాత్రం ఆర్‌సిబి కొంత భరోసా ఇచ్చే స్థితిలో ఉంది. విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టన్, ఫిల్ సాల్ట్, వికెట్ కీపర్ ఫినిషర్ జితేష్ శర్మ జట్టులో ఉన్నారు. వీరితో ఆర్‌సిబి బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అయితే దేవదత్ పడ్డికల్, జాకబ్ బేతల్, టిమ్ డేవిడ్ వంటి వాళ్లు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అనేది ఒక కీలక అంశంగా మారుతుంది.

ఆర్‌సిబికి ఇప్పుడు ప్రధాన సవాలు వారి స్పిన్ డిపార్ట్‌మెంట్. ఈ విభాగంలో అద్భుతమైన వికెట్ టేకర్లు కనిపించడం లేదు. సుయాష్ శర్మ తన మొదటి సీజన్‌లో మంచి ప్రభావం చూపించాడని చెప్పవచ్చు. కానీ, తరువాత అతని ప్రదర్శన చెప్పుకోతగ్గ లేదు. వీటితో పాటు స్వప్నిల్ సింగ్, క్రుణాల్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఉన్నా.. సీజనులో మంచి ప్రదర్శన చూపించగలరా అన్నది సందేహాస్పదంగా ఉంటుంది.

ఇక ఆర్‌సిబి బౌలింగ్‌లో మాత్రం కాస్త బలంగానే కనపడుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజెల్‌వుడ్ జట్టు తిరిగి చేరుకోగా, భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా జట్టులో చోటు పొందాడు. గత సీజన్‌లో చాలా ప్రభావవంతంగా బౌలింగ్ చేసిన యశ్ దయాల్‌ను కూడా RCB రిటైన్ చేసింది. ఈ బౌలర్లు ఆర్‌సిబికి వికెట్స్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. మొత్తానికి ఆర్‌సిబి ఐపీఎల్ 2025 సీజన్‌లో గట్టి పోటీని ఇచ్చే జట్టు కాదని చెప్పడం చాలా కష్టమే. టాప్ ఆర్డర్ బ్యాటింగ్, పేస్ బౌలింగ్ సామర్థ్యం జట్టుగా కనపడుతున్నా, స్పిన్ విభాగం ఒక సమస్యగా కనపడుతోంది. అందువల్ల ఈ సీజన్‌లో కూడా ఆర్‌సిబి కొన్ని సవాళ్లు ఎదురవ్వాల్సి ఉంది.