Leading News Portal in Telugu

Nicholas Pooran Power-Hitting at LSG innings set to 209 Against Delhi Capitals in IPL 2025


  • నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసిన లక్నో సూపర్ జెయింట్స్.
  • విధ్వసం సృష్టించిన మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్
  • 13వ ఓవర్లో సిక్స్‌ల వర్షం కురిపించిన నికోలస్ పూరన్
  • ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదుడు.
Nicholas Pooran: 6,6,6,6,4… ఒకే ఓవర్ లో పూరన్ ఊచకోత

Nicholas Pooran: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. దాంతో బ్యాటింగ్ కు వచ్చిన లక్నో బ్యాట్స్‌మెన్లు మొదటి నుండే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ లు విధ్వంసకర ఇన్నింగ్స్ లతో ఢిల్లీ బౌలర్లకు చెమటలు పట్టించారు.

ముఖ్యంగా నికోలస్ పూరన్ తన పవర్ హిట్టింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో సిక్స్‌ల వర్షం కురిపించాడు పూరన్. తొలి బంతి డాట్‌గా ముగిసిన తర్వాత, వరుసగా 6, 6, 6, 6, 4 బాదేశాడు. ఈ దెబ్బకు ఒక్క ఓవర్లోనే లక్నో స్కోరు భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ వేసిన బంతికి పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు సాధించి వెనుతిరిగారు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.

పూరన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడడానికి ఒక తప్పిదం కారణమైంది. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన తర్వాత, అతను ఇచ్చిన క్యాచ్‌ను సమీర్ రిజ్వీ డ్రాప్ చేశాడు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న పూరన్, మరింత దూకుడు పెంచి భారీ స్కోర్ సాధించాడు. ఈ సీజన్ మెగా ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు నికోలస్ పూరన్‌ను పెద్ద మొత్తంతో కొనుగోలు చేసింది. ఈ మ్యాచ్‌ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు నువ్వు తీసుకొనేదానికి న్యాయం చేసావని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది లక్నో సూపర్ జెయింట్స్.