Leading News Portal in Telugu

IPL 2025: Goenka Gives Motivational Speech To LSG Players After Losing To Delhi


  • ఓటమితో ఐపీఎల్ 2025ని ఆరంభించిన లక్నో
  • ఢిల్లీ మ్యాచ్‌లో రిషబ్ పంత్ తప్పిదాలు
  • ఓటమిపై సానుకూలంగా స్పందించిన లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా
Rishabh Pant: రిషబ్ పంత్ తప్పిదాలు.. లక్నో ఓనర్ ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2025ని లక్నో సూపర్ జెయింట్స్‌ టీమ్ ఓటమితో ఆరంభించింది. విశాఖపట్నం వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ 9 వికెట్స్ కోల్పోయి మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన తప్పిదాల కారణంగా లక్నో ఓడిపోవాల్సి వచ్చింది. 20వ ఓవర్‌లో ఢిల్లీ బ్యాటర్ మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని పంత్ మిస్ చేశాడు. ఒకవేళ పంత్ ఆ స్టంపౌట్ చేసి ఉంటే ఢిల్లీ ఆలౌటై ఓడిపోయేది. అయితే టీమ్ ఓడితే మండిపడే లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓడినా అద్భుత క్రికెట్ ఆడారని లక్నో సూపర్ జెయింట్స్‌ ఆటగాళ్లను సంజీవ్ గోయెంకా మెచ్చుకున్నారు. ఢిల్లీ డగౌట్‌లో ఆటగాళ్లతో సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్‌లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో పవర్‌ప్లేలో ఆడిన విధానం అద్భుతం. బాగా ఆడినా కొన్నిసార్లు ఓటములు ఎదురవుతాయి. మనది యువ జట్టు. సానుకూల అంశాలతో ముందుకువెళదాం. 27న జరిగే మ్యాచ్‌లో మెరుగైన ఫలితాన్ని రాబట్టేందుకు ప్రయత్నిద్దాం. నిజమే ఈ రోజు కాస్త నిరాశ చెందినా.. మంచి మ్యాచ్ ఇది. ప్రతి ఒక్కరు బాగా ఆడారు’ అని ప్రశంసించారు. మార్చి 27న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో మ్యాచ్ ఆడనుంది.

ఐపీఎల్ 2024లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో లక్నోను సన్‌రైజర్స్ ఓడించింది. లక్నో 165/4 స్కోర్ చేయగా.. లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ బాధేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేశారు. ఇద్దరు కలిసి 14 సిక్సర్లు, 16 ఫోర్లతో 166 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. ఈ ఓటమి లక్నో రన్ రేట్‌పై పడి.. చివరికి ప్లేఆఫ్‌కు వెళ్లకుండా చేసింది. ఈ ఓటమి తర్వాత సంజీవ్ గోయెంకా అప్పటి కెప్టెన్ లోకేష్ రాహుల్‌తో గొడవ పడ్డాడు. అనంతరం రాహుల్ లక్నోకు బై చెప్పాడు. మెగా వేలంలో ఢిల్లీలో చేరాడు.