Leading News Portal in Telugu

Mohammed Siraj Reacts to Being Dropped from Champions Trophy Squad.


  • ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టులో సిరాజ్‌కు దక్కని చోటు
  • తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఫాస్ట్ బౌలర్
  • తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను- సిరాజ్
  • జట్టు ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకున్నా- సిరాజ్.
Mohammed Siraj: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోవడంపై సిరాజ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టులో చోటు లభించకపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని.. కానీ జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నానని సిరాజ్ తెలిపాడు. 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్‌లలో భారత జట్టు సభ్యుడిగా ఉన్న సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎంపిక కాలేదు. దుబాయ్‌లో అన్ని మ్యాచ్‌లు జరుగుతుండటంతో టీమిండియా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్లాలని నిర్ణయించింది. దీంతో సిరాజ్‌ను నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు. కానీ చివరకు అతని సేవలు అవసరం రాలేదు.

ఛాంపియన్స్ ట్రోఫ్రీ టోర్నమెంట్ జట్టులో తనకు అవకాశం రాకపోవడం మొదట్లో బాధించినప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నానని సిరాజ్ చెప్పాడు. “మీరు దేశం తరఫున ఆడినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. అంతర్జాతీయ ఆటగాడిగా ఐసీసీ టోర్నమెంట్లలో ఆడాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు. తొలుత నేను జట్టులో లేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. అయితే, రోహిత్ భాయ్ జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాడు. అతనికి అనుభవం ఉంది. ఆ పిచ్‌లపై పేసర్లు అంత ప్రభావం చూపకపోవచ్చని అతను అర్థం చేసుకున్నాడు. అందుకే స్పిన్నర్లను ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు” అని సిరాజ్ తెలిపాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో లేని సమయంలో తన ఫిట్‌నెస్, బౌలింగ్ మెరుగుపరచుకోవడానికి ఈ విరామాన్ని ఉపయోగించుకున్నానని సిరాజ్ వెల్లడించాడు. చాలా కాలంగా నిరంతరం క్రికెట్ ఆడుతున్నాను కాబట్టి, కొన్ని చిన్న తప్పులను గుర్తించలేకపోయానని, ఈ విరామం తనకు ఎంతో మేలుచేసిందని తెలిపాడు. ఏదేమైనప్పటికీ.. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అదే నాకు పెద్ద ఆనందం అని సిరాజ్ పేర్కొన్నాడు. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ పర్యటనలో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని, భారత జట్టులో తన స్థానం మరింత పటిష్టం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.