- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్
- టీమిండియాకు రూ.58 కోట్ల నజరానా
- గంభీర్ తన ప్రైజ్‌మనీని వెనక్కి ఇస్తాడా?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.58 కోట్లను నజరానా ప్రకటించింది. భారత ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్‌కు రూ.3 కోట్ల ప్రైజ్‌మనీ చొప్పున దక్కనుంది. అలానే సహాయక కోచింగ్ సిబ్బందికి రూ.50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున దక్కనుంది. అయితే టీ20 ప్రపంచకప్ 2024 గెలిచినప్పుడు అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్‌మనీని వెనక్కి ఇచ్చి.. సహచరులకు సమంగా పంచాలని కోరారు. ఈ అంశంపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ద్రవిడ్‌లా గంభీర్ కూడా తన ప్రైజ్‌మనీని వెనక్కి ఇస్తాడా? అని ప్రశ్నించారు.
‘టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన టీమిండియాకు బీసీసీఐ ప్రైజ్‌మనీ ప్రకటించింది. అప్పుడు భారత జట్టుకు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు ఇతర సిబ్బందితో పోలిస్తే.. భారీగా నజరానా అందింది. ద్రవిడ్ ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి.. తన సహచరులకు సమంగా పంచమన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు కూడా బీసీసీఐ రివార్డు ప్రకటించింది. రివార్డులను ప్రకటించి పక్షం రోజులు అయ్యింది. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ద్రవిడ్‌లా గంభీర్ చేస్తాడా? లేదా?’ అని స్పోర్ట్స్‌స్టార్ కాలమ్‌లో సునీల్ గవాస్కర్ రాసుకొచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజయం సాధించిన క్రికెటర్లకు బహుమతులు ఇచ్చినందుకు బీసీసీఐని సునీల్ గవాస్కర్ ప్రశంసించారు. ‘బీసీసీఐ నిర్ణయం సూపర్. ఆటగాళ్లు సాధించిన దానికి నజరానా ప్రకటించడం అభినందనీయం. టీ20 ప్రపంచకప్ 2025 అనంతరం రూ.125 కోట్లు అందించింది. బోర్డు ప్రతిఒక్కరూ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. వారికి బహుమతులు అందిస్తోంది. అలాగే విజేతల కోసం ఐసీసీ ప్రకటించిన బహుమతి డబ్బును కూడా ఆటగాళ్ల వద్దే ఉంచుకోవడానికి బీసీసీఐ అనుమతిస్తోంది. ఇది అద్భుతం. ఇలా చేయడం వల్లన ప్రతి ఒక్కరికీ భారీ మొత్తం లభిస్తోంది’ అని సన్నీ పేర్కొన్నారు.