ఛెత్రి.. అద్భుతం
ముంబై: సర్వం తానే అయి ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చిన భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి.. తుది పోరులోనూ అదే జోరును కనబరిచాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కెన్యాపై 8, 29వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. వచ్చే ఏడాది జరిగే ఏఎఫ్‌సీ ఆసియా కప్ సన్నాహకంలో భాగంగా జరిగిన ఈటోర్నీలో భారత్ కేవలం న్యూజిలాండ్‌పై మాత్రమే ఓడింది. అంతకుముందు తమ సహజ శైలికి భిన్నంగా దూకుడుగా చెలరేగడంతో భారత్ ప్రథమార్ధంలోనే రెండు గోల్స్‌తో ఆధిక్యంలో నిలిచింది. ఆరంభంలో కెన్యా ధాటిగా ఆడుతూ గోల్‌పోస్టుపై దాడులకు దిగింది. కానీ గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సంధూ అప్రమత్తతో వ్యహరించాడు. అయితే ఎనిమిదో నిమిషంలోనే భారత్ తమ ఖాతా తెరిచింది.
మిడ్‌ఫీల్డర్ అనిరుధ్ థాపా తక్కువ ఎత్తులో ఇచ్చిన ఫ్రీకిక్‌ను అందుకున్న కెప్టెన్ సునీల్ ఛెత్రి లాఘవంగా నెట్‌లోకి పంపడంతో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ టోర్నీలో అతడికిది ఏడో గోల్ కావడం విశేషం. ఈ దశలో కెన్యా డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తూ భారత్ తమ దాడులను ఉధృతం చేసింది. 19వ నిమిషంలో కెన్యాకు గోల్ చేసే అవకాశం వచ్చినా సంధూ సులువుగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత కూడా దాడులకు దిగినా భారత్ డిఫెండర్లు దీటుగా ఎదుర్కొన్నారు. ఛెత్రి మరో అద్భుత గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.
29వ నిమిషంలో సెంటర్ బ్యాక్ నుంచి డిఫెండర్ అనస్ ఎడతోడికా అందించిన పాస్‌ను తన ఛాతీతో ఆపిన ఛెత్రి కాస్త ముందుకు వెళ్లి ఎడమకాలితో గోల్‌పోస్టులోకి పంపాడు. దీంతో తొలి అర్ధభాగంలోనే భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యం అందుకుంది. ద్వితీయార్థం ప్రారంభంలోనే కెన్యా ఎదురుదాడికి దిగింది. తొలి రెండు నిమిషాల్లోనే రెండుసార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించినా కీపర్ సంధూ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. 57వ నిమిషంలో వారికి కార్నర్ లభించినా ఛెత్రి బంతిని దూరంగా పంపాడు. అలాగే 75వ నిమిషంలో కెన్యా ఫ్రీకిక్ అవకాశాన్ని కూడా సంధూ డైవ్ చేస్తూ అద్భుతంగా అడ్డుకోవడంతో పాటు భారత జట్టు ఆటగాళ్లు చివరివరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకుని విజేతగా నిలిచారు.