Leading News Portal in Telugu

బంగ్లాదేశ్‌ సంచలనం

కౌలాలంపూర్‌: ఓ వైపు తమ పురుషుల జట్టు అఫ్ఘానిస్థాన్‌లాంటి చిన్న జట్టుతో వైట్‌వాష్‌ అయినా.. బంగ్లాదేశ్‌ మహిళల జట్టు మాత్రం పెను సంచలనమే సృష్టించింది. 2004లో మహిళల ఆసియాకప్‌ ప్రారంభమైనప్పటి నుంచీ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న భారత జట్టును కంగుతినిపిస్తూ చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో తమకన్నా ఎంతో మెరుగైన భారత్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి తొలిసారిగా టైటిల్‌ అందుకుంది. ఆఖరి బంతి వరకు పోరాడిన బంగ్లా చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు కావాల్సి ఉండగా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది.

అయినా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా చిట్టచివరి బంతికి రెండు పరుగులు తీసి హర్మన్‌ప్రీత్‌ సేనకు గట్టి షాకే ఇచ్చింది. భారత్‌కు ఈ టోర్నీలో ఎదురైన రెండు పరాజయాలు బంగ్లా చేతిలోనే కావడం గమనార్హం. భారత మాజీ ఓపెనర్‌ అంజూ జైన్‌ బంగ్లాదేశ్‌ కోచ్‌గా ఉండడం వారికి లాభించింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (56) మినహా అంతా విఫలమయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 113 పరుగులు చేసి నెగ్గింది. నిగర్‌ సుల్తానా (27) టాప్‌ స్కోరర్‌. 18 బంతుల్లో 23 పరుగులు రావాల్సి ఉండగా చివరి బంతికి బంగ్లా విజయం సాధించగలిగింది.