పట్టేశాడు పదకొండు!
పారిస్: సంచలనానికి తావేలేదు. రోలండ్ గారోస్‌లో ఊహించిన ఫలితమే. ఫ్రెంచ్ ఓపెన్ కిరీటం మళ్లీ రఫెల్ నడాల్‌నే వరించింది. ఫైనల్‌కు వచ్చిన ప్రతీసారి విజేతగా నిలిచిన ఈ స్పెయిన్ యోధుడు పదకొండో టైటిల్‌ను అలవోకగా పట్టేశాడు. ఆస్ర్టియా యువ సంచలనం డామినిక్ థీమ్ ఆట కట్టించి కెరీర్‌లో 17వ గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన టైటిల్ ఫైట్‌లో టాప్ సీడ్, వరల్డ్ నెంబర్ వన్ రఫా 6-4, 6-3, 6-2తో ఏడో సీడ్ డామినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను మట్టికరిపించాడు. దాంతో, ఓపెన్ ఎరాలో ఒక గ్రాండ్‌స్లామ్‌ను అత్యధిక సార్లు నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను 11 సార్లు) సరసన నిలిచాడు. గతేడాది ఇటాలియన్ ఓపెన్ క్వార్టర్స్‌తో పాటు మొన్నటి మాడ్రి డ్ ఓపెన్ క్వార్టర్స్‌లో తనను ఓడించిన థీమ్‌పై ఈ మ్యాచ్‌లో నడాల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. గట్టి పోటీ ఇస్తాడనుకున్న ఆస్ర్టియా పొడగరి థీమ్ పోరాటం తొలి సెట్‌లో రెండు గేమ్‌లకు మాత్రమే పరిమితమైంది. ఏడు ఏస్‌లు, 34 విన్నర్లు సంధించినప్పటికీ ఐదు డబుల్ ఫాల్ట్స్, 42 అనవసర తప్పిదాలతో థీమ్ మూల్యం చెల్లించుకున్నాడు. చివరిసెట్లో చేతివేలికి గాయమైనా ఏమాత్రం పట్టువిడవని రఫా.. సులువుగా మ్యాచ్ నెగ్గాడు.
అలవోకగా..: ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నడాల్ అంచనాలకు తగ్గ ఆటతో అదరగొట్టాడు. 2 గంటల 42 నిమిషాల పోరులో.. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న థీమ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది కొద్దిసేపే. 11వ టైటిల్ కోసం సర్వీస్ ప్రారంభించిన నడాల్.. థీమ్ తొలి సర్వీస్‌నే బ్రేక్ చేసి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. దీనికి డామినిక్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు రఫా తప్పిదాలను సొమ్ము చేసుకుం టూ నాలుగో గేమ్‌లో బ్రేక్ సాధించి 2-2తో స్కోరు సమం చేశాడు. తర్వాత ఇద్దరూ చెరో గేమ్ నెగ్గారు. బలమైన షాట్లు కొడుతున్న థీమ్ జోరు చూస్తుంటే నడాల్‌కు గట్టి పోటీ తప్పదనిపించింది. కానీ, రఫా ఒక్కసారిగా విజృంభించి అతనికి కళ్లెం వేశాడు. కీలక దశలో తన అనుభవాన్ని రంగరించిన నడాల్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 6-4తో సెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోరును రెండో సెట్‌లోనూ కొనసాగిస్తూ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
మరోవైపు థీమ్ పదే పదే తప్పిదాలు చేస్తూ వచ్చిన అవకాశాలను కూడా కోల్పోయాడు. ప్రశాంతంగా పని కానిచ్చిన టాప్‌సీడ్ తన సర్వీస్‌లో సెట్ గెలిచి మ్యాచ్‌లో 2-0తో ఆధిక్యం సాధించాడు. ఇక మ్యాచ్‌లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మూడో సెట్‌లో డామినిక్ అద్భుత ఆరం భం దక్కించుకున్నాడు. తన సర్వీస్‌లో 0-40తో వెనుకబడ్డ అతను.. నాలుగు బ్రేక్ పాయింట్లు కాచుకుంటూ గేమ్ నెగ్గి ఔరా అనిపించాడు. కానీ, మూడో గేమ్‌లోనే అతని సర్వీస్‌ను నడాల్ బ్రేక్ చేయడంతో డీలా పడ్డాడు. ఆపై చేతి వేళ్ల నొప్పితో బాధ పడుతున్నా రఫా ఏమాత్రం జోరు తగ్గకుండా 5-2తో మ్యాచ్ పాయింట్ కోసం సర్వ్ చేశాడు. థీమ్ వైడ్ షాట్ ఆడడంతో నడాల్ జయకేతనం ఎగరవేశాడు.