కరోనా కట్టడికి పఠాన్ బ్రదర్స్ భారీ సాయం!!
న్యూఢిల్లీ: కరోనా కకలావికలంతో రోడ్డున పడ్డ అనేక మంది అభాగ్యులకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్స్ పఠాన్ బ్రదర్స్ అండగా నిలిచారు. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ నుంచి రక్షించేందుకు నిరుపేద ప్రజలకు మాస్క్‌లను పంచిన ఈ స్టార్ క్రికెటర్స్.. తాజాగా ఆకలితో అలమటిస్తున్న పేదల కడుపు నింపి తమ పెద్ద మనసు చాటుకున్నారు.
ఏకంగా పదివేల కేజీల బియ్యాన్ని, 700 కేజీల ఆలుగడ్డ(బంగాళదుంప)లను పంచి అభాగ్యుల ఆకలి తీర్చారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడనీ జీవులు.. యాచకుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. బతుకు దెరువు కోసం నగరాలకు వచ్చిన కూలీల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. ఓ వైపు సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణ సదుపాయం లేక.. మరోవైపు పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అభాగ్యులను ఆదుకోవడానికి సంపన్నులు ముందుకు రావాలని, ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సెలబ్రిటీలు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. క్రీడాలోకం కూడా తమ సాయాన్ని ప్రకటించింది. విరాట్ కోహ్లీ దంపతులు రూ.3 కోట్లు, సచిన్, గంగూలీ రూ.50 లక్షలు, రోహిత్ శర్మ 80 లక్షలు, యువరాజ్ 50 లక్షలు.. ఇలా ప్రతీ ఒక్కరు తమకు తోచిన సాయాన్ని అందించారు.