సైబర్ నేరగాళ్లు జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటున్నారు. అయితే, ఈ మధ్య ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఈ-చలాన్ల పేరిట కొత్త రకం మోసానికి తెరదీశారు. ఈ-చలాన్ల పేరుతో వాహనదారులకు వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ లు పంపి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. దాంతో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇక, ఇటీవలి కాలంలో సైబర్ చీటర్స్ ఈ-చలాన్ల పేరుతో వ్యక్తిగత మెస్సేజ్ లు పంపుతున్నారని, అందులోనే పేమెంట్ లింకును కూడా ఉంచుతున్నారు.. ఎవరైనా నిజమే అనుకుని ఆ లింకుపై క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా వివరాలను హ్యాక్ చేసి అందులో ఉన్న మొత్తం డబ్బులు మాయం చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి మెస్సేజ్ ల పట్ల వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
సాధారణంగా ఈ-చలాన్ల పేరిట వచ్చే మెసేజ్‌లలో వాహనం నంబర్, ఇంజిన్, ఛాసిస్ నంబర్ లాంటి వివరాలు ఉంటాయి.. సైబర్ నేరగాళ్లు పంపే వాటిలో ఆ వివరాలు ఏమీ ఉండవని పోలీసులు చెప్పుకొచ్చారు.
అదేవిధంగా ఇలాంటి మెసేజ్‌లు తమ మొబైల్ ఫోన్ల నుంచి రావనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇలాంటి అనుమానాస్పద సందేశాలు వచ్చినప్పుడు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలని పోలీసులు వెల్లడించారు. ఈ-చలాన్లకు సంబంధించిన వెబ్‌సైట్‌ను పోలిన వెబ్సైట్లతో నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి, బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.