
Xiaomi says goodbye to MIUI after 13 years: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ స్మార్ట్‌ఫోన్స్ వాడే వారందరికీ ‘ఎంఐయూఐ’ సుపరిచితమే. ఎంఐయూఐ సాఫ్ట్‌వేర్ బ్రాండ్‌కి ఓ పర్యాయపదంగా మారింది. ఎంఐ, రెడ్‌మీ ఫోన్లతో పాటు పోకో ఫోన్లలో కూడా ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. షావోమి ఎంఐయూఐకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 13 ఏళ్లుగా తమ స్మార్ట్‌ఫోన్స్‌లో వాడుతున్న ఎంఐయూఐకి షావోమి గుడ్‌బై చెబుతోంది. ఎంఐయూఐ స్థానంలో కొత్తగా హైపర్ ఓఎస్‌ను తీసుకొస్తోంది.
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 భారతదేశంలో గత మార్చిలో ప్రకటించబడింది. షావోమి 13 ప్రోలో ఈ సాఫ్ట్‌వేర్ వచ్చింది. అయితే షావోమి ఫోన్లలో ఇకపై ఎంఐయూఐ ఉండదని, దాని స్థానంలో హైపర్ ఓఎస్ తీసుకొస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ లీజున్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. షావోమి 14 స్మార్ట్‌ఫోన్స్ హైపర్ ఓఎస్‌తో రానున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి చైనాకు మాత్రమే పరిమితమైన ఈ ఓఎస్.. భవిష్యత్‌లో చైనా వెలుపల కూడా పరిచయం కానుంది. దశలవారీగా షావోమి ఫోన్లలో హైపర్ ఓఎస్‌ను తీసుకురానున్నారని తెలుస్తోంది.
ఎంఐయూఐ స్థానంలో కొత్త ఓఎస్‌ను షావోమి డెవలప్ చేస్తోందని గత కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ రూమర్లే నిజమయ్యాయి. షావోమి ఫోన్లలో ఎంఐయూఐను కంపెనీ ఏళ్లుగా మెరుగుపరుస్తూ వస్తోంది. తొలి తరం యూఐతో పోలిస్తే.. ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. అయితే ఒప్పో కలర్ ఓఎస్, శాంసంగ్ వన్ యూఐ, వివో ఫన్‌టచ్ ఓఎస్‌లు షావోమికి గట్టి పోటీనిస్తున్నాయి. దీంతో యూఐ పరంగా భారీ మార్పులకు షావోమి శ్రీకారం చుట్టింది. హైపర్ ఓఎస్‌తో త్వరలో మార్కెట్లోకి రానుంది.