Leading News Portal in Telugu

Instagram Down: ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం.. ఎక్స్‌లో ఫిర్యాదులు!


  • ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం
  • దేశవ్యాప్తంగా సేవల్లో సమస్యలు
  • హ్యాక్ అయిందా? అంటూ వినియోగదారుల ఆందోళన
Instagram Down: ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం.. ఎక్స్‌లో ఫిర్యాదులు!

Instagram Facing Issues Across India: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఉదయం 11:15 గంటల సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అప్లికేషన్‌ లాగిన్‌, సర్వర్‌ కనెక్షన్‌కు సంబంధించిన సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం… 64 శాతం మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్‌ అవ్వడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. 24 శాతం మంది వినియోగదారులు సర్వర్‌ కనెక్షన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు కలిగిన అంతరాయాన్ని పలువురు ఇన్‌స్టా యూజర్లు.. మరో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ ద్వారా పంచుకున్నారు. కొందరికి స్క్రీన్‌పై ‘సమ్‌ థింగ్‌ వెంట్‌ రాంగ్‌’ వంటి మెసేజ్‌లు వచ్చాయి. దీంతో కొందరు యూజర్లు తమ అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా? అని ఆందోళన పడ్డారు. మరికొందరు యూజర్లు అయితే ఏకంగా యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసి.. రీ ఇన్‌స్టాల్ చేశారట.

ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై ‘మెటా’ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఢిల్లీ, జైపుర్‌, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌, కోల్‌కతా, హైదరాబాద్‌‌, చెన్నై లాంటి నగరాల్లో యూజర్లు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. డౌన్‌ డిటెక్టర్‌ ప్రకారం.. మధ్యాహ్నం 12.02 గంటల వరకు 6,500 మంది వినియోగదారులు యాప్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారట. గత జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.