Leading News Portal in Telugu

Uber Launches ‘Uber for Teens’ in India A Safe and Reliable Ride Option for Young Riders


  • ‘Uber for Teens’ పేరుతో సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టిన ఉబర్
  • 13 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల టీనేజ్ రైడర్ల కోసం ప్రత్యేకంగా
  • ఈ సేవ యువతకు భద్రతతో కూడిన, నమ్మకమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి.
Uber: ‘Uber for Teens’ పేరుతో సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టిన ఉబర్

Uber: ప్రముఖ రైడ్-హైలింగ్ సంస్థ ఉబర్ (Uber) తాజాగా భారతదేశంలో ‘Uber for Teens’ సేవను ప్రారంభించింది. 13 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల టీనేజ్ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సేవ యువతకు భద్రతతో కూడిన, నమ్మకమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. ఉబర్ ఈ కొత్త సేవలో GPS ట్రాకింగ్, రియల్-టైమ్ రైడ్ మానిటరింగ్, ఇన్-యాప్ ఎమర్జెన్సీ బటన్ వంటి ముఖ్యమైన భద్రతా లక్షణాలను అందించింది. ఈ సేవతో తల్లిదండ్రులకు మానసిక ప్రశాంతత, పిల్లలకు స్వేచ్ఛ అనే ఉద్దేశంతో ఉబర్ ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఉబర్ నిర్వహించిన సర్వే ప్రకారం 92% తల్లిదండ్రులు తమ పిల్లల ప్రయాణ ఏర్పాట్ల విషయంలో ఇబ్బంది పడతారని వెల్లడైంది. అలాగే 72% మంది తల్లిదండ్రులు భద్రతాపరమైన సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. సర్వేలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. 63% తల్లిదండ్రులు తమ పిల్లల అధిక ప్రయాణ అవసరాలకు స్వంత వాహనాలపై ఆధారపడతారు.

Uber for Teens సేవ ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే..

తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రత్యేక ఉబెర్ టీన్ ఖాతాలను సృష్టించవచ్చు. వారు ప్రతీ ట్రిప్‌ను రియల్-టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. ప్రయాణానంతరం ట్రిప్ రిపోర్ట్ కూడా అందుకుంటారు. టీన్ అకౌంట్‌తో బుక్ చేసిన రైడ్స్ ముందుగానే నిర్ణయించిన గమ్యస్థానానికి మాత్రమే వెళ్తాయి. ఇందులో డ్రైవర్లు మార్గాన్ని మార్చలేరు. పూర్తి బ్యాక్‌ గ్రౌండ్ చెకింగ్ చేసిన, మంచి రేటింగ్ ఉన్న డ్రైవర్లనే ఉబెర్ టీన్ సేవకు ఎంపిక చేస్తారు. పిన్ వెరిఫికేషన్, రైడ్ చెక్, రియల్-టైమ్ ట్రాకింగ్ వంటి భద్రతా ఫీచర్లు ఆన్-ఆఫ్ చేయలేని విధంగా ఉంటాయి. అదనంగా, టీనేజ్ రైడర్లు తమ భద్రత కోసం ఆడియో రికార్డింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.

ఇక ఇందులో అదనపు ఫీచర్ల విషయానికి వస్తే.. తల్లిదండ్రుల అనుమతితో 13 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇతర స్నేహితులు కూడా టీన్ రైడుతో ప్రయాణించవచ్చు. అయితే, అందరూ వెనుక సీట్లో కూర్చోవాల్సి ఉంటుంది. సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. అవసరమైతే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం స్వయంగా ట్రిప్ బుక్ చేయగలరు. టీనేజ్ రైడర్ 18 సంవత్సరాలు చేరుకున్న తర్వాత, వారి అకౌంట్ సాధారణ ఉబెర్ ఖాతాగా మారుతుంది. అయితే, ఫ్యామిలీ ప్రొఫైల్‌లో కొనసాగిస్తే తల్లిదండ్రులు ట్రిప్‌ లను మానిటర్ చేయగలరు.

ప్రస్తుతం ఈ Uber for Teens సేవ భారతదేశంలోని 37 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. వీటిలో ఢిల్లీ NCR, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాలు ముఖ్యమైనవి. తల్లిదండ్రులు ఈ ఫీచర్‌ను Uber యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు. Family Profile సెట్టింగ్స్‌లో “Add a Teen” ఎంపిక చేసి ఈ సేవను యాక్టివేట్ చేయవచ్చు. ఉబర్ ఈ సేవను మరిన్ని నగరాలకు విస్తరించే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇది తల్లిదండ్రులకు ప్రయాణ సౌలభ్యం, పిల్లలకు భద్రతతో కూడిన స్వేచ్ఛను అందించడమే లక్ష్యంగా కొనసాగుతుంది.