- ఏప్రిల్ 17న విడుదల కానున్న మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్
- 12.7-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, 3K రిజల్యూషన్ లతో పాటు అనేక ఫీచర్లు.

Moto Pad 60 Pro: ఇండియన్ మార్కెట్‌లో మోటరోలా మరోసారి తన కొత్త ప్రాడెక్ట్స్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారైన మోటరోలా కొత్తగా మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్, మోటో బుక్ 60 ల్యాప్‌టాప్ లను ఏప్రిల్ 17న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనుంది. ఇక వీటిలో మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్ సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం.
ఈ మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్‌లో 12.7 అంగుళాల LCD డిస్‌ప్లే అందించబడింది. ఇది 3K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మెరుగైన విజువల్ అనుభవం కోసం ఇందులో క్వాడ్ JBL స్పీకర్ వ్యవస్థను, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌ను మోటరోలా అందిస్తోంది. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. ఇందులో అధునాతన 4nm తయారీ ప్రక్రియతో రూపొందించిన ఆక్టా-కోర్ Dimensity 8300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీని ద్వారా ట్యాబ్లెట్ వేగవంతమైన, సమర్థవంతమైన పనితీరును అందించగలదు. ఈ మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్ 10,200 mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. ఇది 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడినది. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 10 గంటల వరకూ నిరంతరంగా ఉపయోగించవచ్చు.
ఈ ట్యాబ్‌తో పాటు మోటో పెన్ ప్రోను కూడా అందించనున్నారు. ఇది 4096 లెవల్స్ ప్రెజర్ డిటెక్షన్, టిల్ట్ డిటెక్షన్, పామ్ రిజెక్షన్ వంటి ఫీచర్లతో వస్తోంది. అత్యల్ప లేటెన్సీతో కూడిన ఈ పెన్ ఒకసారి ఛార్జ్ చేస్తే 35 గంటల వరకూ పనిచేస్తుంది. ఇక ఇందులోని ఇంటెలిజెంట్ కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. మోటరోలా ఈ ట్యాబ్లెట్‌లో క్రాస్ కంట్రోల్, స్వైప్ టూ స్ట్రీమ్, ఫైల్ ట్రాన్స్ఫర్ వంటి అద్భుతమైన కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తోంది. క్రాస్ కంట్రోల్ ద్వారా ట్యాబ్లెట్‌ను మీ PCతో సింక్ చేసి, రెండింటినీ ఒకేసారి నియంత్రించవచ్చు. స్వైప్ టూ స్ట్రీమ్ ద్వారా మీ యాప్ యాక్టివిటీలను సెకన్లలో పెద్ద స్క్రీన్‌కు తరలించవచ్చు. ఫైల్ ట్రాన్స్ఫర్ సాయంతో డివైస్‌ల మధ్య ఫైల్స్‌ను సులభంగా షేర్ చేయవచ్చు. మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్స్ ను ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. ధర, ఇతర వివరాలు ఏప్రిల్ 17న విడుదల రోజు వెల్లడించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.