
AI Agent Hospital: ప్రతి రంగంలో దూసుకెళ్తున్న చైనా తాజాగా వైద్య రంగంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) టౌన్ ను ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో పని చేస్తుంది. ఈ టౌన్‌లో రోగులను AI డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. అంటే ఇక్కడ డాక్టర్లు మనుషులు కాదు. పూర్తిగా రోబోలే డాక్టర్లుగా సేవలు అందిస్తాయి. మరి ఈ వింత విషయానికి సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా..
చైనాలోని ప్రముఖ విద్యా సంస్థలలో ఒకటైన ట్సింగ్హువా యూనివర్సిటీ వైద్య రంగంలో విప్లవాత్మక అడుగు వేసింది. 2025 ట్సింగ్హువా మెడిసిన్ టౌన్‌హాల్ సమావేశంలో ఈ సంస్థ కృత్రిమ మేధస్సు ఆధారిత ‘AI ఏజెంట్ హాస్పిటల్’ ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇది వైద్య సేవలలో AI సమగ్ర భాగస్వామిగా మారే దిశగా కీలకంగా మారింది. ఈ AI హాస్పిటల్‌ను అనుబంధ రంగాలైన ఇంజినీరింగ్, మెడిసిన్ లో ట్సింగ్హువా యూనివర్సిటీ కలిగిన అనుభవాన్ని వినియోగించి దశలవారీగా అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. ఇక తొలి దశలో బీజింగ్ ట్సింగ్హువా చంగుగ్ హాస్పిటల్, దానికి అనుబంధంగా ఉన్న ఇంటర్నెట్ హాస్పిటల్‌లో పైలట్ ప్రోగ్రామ్‌లు ప్రారంభం కానున్నాయి. వీటిలో జనరల్ ప్రాక్టీస్, రేడియాలజికల్ డయాగ్నొస్టిక్స్, శ్వాస సంబంధిత విభాగాలతోపాటు మరికొన్ని ఉండనున్నట్లు తెలిపారు.
ఈ హాస్పిటల్ ప్రధాన లక్ష్యం AI ను ఉపయోగించి ఆరోగ్యం, విద్య, పరిశోధన రంగాలను సమగ్రంగా కలిపి ఓ ‘ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టం’ ను నిర్మించడం. ఇది అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా, అందుబాటులోకి తీసుకరావడానికి, అలాగే వాటిని ప్రాచుర్యం పొందేలా చేయడం. దీని ద్వారా మెరుగైన వైద్యాన్ని సామాన్యులకు అందించాలన్న దూర దృష్టిని ట్సింగ్హువా పెట్టుకుంది. ఇక ఇది నిజమైన క్లినికల్ అవసరాల ఆధారంగా అభివృద్ధి చేసారు. దీని ద్వారా వైద్యులు నిర్దిష్ట నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగనుంది. అలాగే ముఖ్యంగా ప్రాథమిక వైద్యం అందించే డాక్టర్ల కొరతను అధిగమించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
నవంబర్ 2024లో ట్సింగ్హువా “జిజింగ్ AI డాక్టర్” అనే ప్రయోగాత్మక ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇది వర్చువల్ మెడికల్ ఎన్విరాన్మెంట్ ఆధారంగా అభివృద్ధి చేయబడినదిగా పేర్కొన్నారు. ఈ వ్యవస్థతో, AI ఆధారిత వైద్య ఏజెంట్ల అభివృద్ధిని వేగవంతం చేయడానికి బలమైన పునాదులు వేసారు. భవిష్యత్తులో ఈ హాస్పిటల్ పూర్తిగా AI ఆధారిత హాస్పిటల్‌గా రూపాంతరం పొందడం, AI-సహాయక వైద్యులను తయారు చేసే కేంద్రంగా మారడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశాబ్దంలో ఆరోగ్యరంగంలో AI ప్రాధాన్యత మరింత పెరగనున్న నేపథ్యంలో ఈ AI ఏజెంట్ హాస్పిటల్ ఒక కొత్త అడుగు.