Leading News Portal in Telugu

Do you know what technology Google Maps runs on


  • గూగుల్ మ్యాప్స్ ఎన్ని కిలోమీటర్ల దూరాన్నైనా చూపిస్తుందా?
  • ఏ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది
Google Maps: గూగుల్ మ్యాప్స్ ఎన్ని కిలోమీటర్ల దూరాన్నైనా చూపిస్తుందా? అది ఏ టెక్నాలజీపై పనిచేస్తుందో తెలుసా?

గూగుల్ మ్యాప్స్ ఒక తెలియని ప్రాంతానికి వెళ్లడానికి దారి తెలుసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. నేటి డిజిటల్ యుగంలో, ప్రయాణ ప్రణాళిక నుంచి దిశలు, ట్రాఫిక్ అప్ డేట్స్ తెలుసుకోవడం వరకు ప్రతిదానికీ సహాయపడే సాధనంగా గూగుల్ మ్యాప్స్ మారింది. గూగుల్ మ్యాప్స్ అనేది ఒక శక్తివంతమైన నావిగేషన్ సాధనం. ఆఫీసుకు వెళ్లే మార్గాన్ని తెలుసుకోవాలన్నా లేదా హైదరాబాద్ నుంచి ముంబైకి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలన్నా, Google Maps కొన్ని సెకన్లలో దూరం, సమయం, మార్గాన్ని తెలియజేస్తుంది. అయితే గూగుల్ మ్యాప్స్ ఎన్ని కిలోమీటర్ల దూరాన్నైనా చూపిస్తుందా? అది ఏ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది? అని ఆలోచిస్తుంటారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్ మ్యాప్స్ ఎటువంటి దూర పరిమితిని కలిగిలేదు. లక్షలాది కిలోమీటర్ల వరకు ఉన్న మార్గాలను కూడా ఇది చూపిస్తుంది. ఉదాహరణకు, మీరు భారతదేశం నుంచి యూరప్‌లోని ఏ దేశానికైనా మార్గాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇది ఆచరణాత్మకంగా సాధ్యం కాకపోవచ్చు. కానీ, సాంకేతికంగా మ్యాప్స్ దాన్ని చూపించగలవు. గూగుల్ మ్యాప్స్ అనేది గూగుల్ సంస్థ అభివృద్ధి చేసిన ఒక ఆన్‌లైన్ మ్యాపింగ్ సేవ. ఇది వినియోగదారులకు రహదారి మార్గాలు, గమ్యస్థానాలు, ట్రాఫిక్ సమాచారం, దూరాలు, స్థలాల గురించిన వివరాలను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, లేదా కంప్యూటర్ ద్వారా ఈ సేవను ఉపయోగించవచ్చు.

గూగుల్ మ్యాప్స్ పనిచేసే విధానం చాలా క్లిష్టంగా ఉంటుంది కానీ ఆసక్తికరంగా ఉంటుంది. ఇది అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కలిసి పనిచేస్తుంది. వాటిలో ముఖ్యమైనది GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ టెక్నాలజీ ఉపగ్రహం ద్వారా మీ ఫోన్ స్థానాన్ని ట్రాక్ చేసి మీరు ఎక్కడ ఉన్నారో తెలియజేస్తుంది. ఇది కాకుండా, గూగుల్ ఒక ప్రత్యేక వ్యవస్థను ఉపయోగిస్తుంది. దీనిని GIS అంటే భౌగోళిక సమాచార వ్యవస్థ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ మ్యాప్‌లు, రోడ్లు, స్థానాలకు సంబంధించిన చాలా సమాచారాన్ని డిజిటల్ రూపంలో నిల్వ చేస్తుంది. మీరు డైరెక్షన్స్ ను అడిగినప్పుడు, ఆ డేటా ఆధారంగా ఇది మీకు మార్గనిర్దేశం చేస్తుంది.

గూగుల్ మ్యాప్స్‌ను స్మార్ట్‌గా, అప్ డేట్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సాంకేతికతలు మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ మార్గంలో వెళతారు, ఎక్కడ ఆగుతారు, ఏ సమయంలో ఏ మార్గం ఖాళీగా ఉంటుంది వంటి కస్టమర్ల వివరాలను నిక్షిప్తం చేసుకుంటాయి. దీంతో Google మెరుగైన సూచనలను ఇస్తుంది.