Leading News Portal in Telugu

BSNL Launches Q-5G Services as ‘Quantum 5G’, Introduces SIM-Free FWA Internet


BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

BSNL Q-5G: దేశీయ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ 5జీ సేవలకు ‘Q-5G’ అనే పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనను బీఎస్‌ఎన్‌ఎల్ తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్ షేర్ చేసిన పోస్టులో.. “మీరు పేరు పెట్టారు.. మేము నిజం చేశాం. ‘THE BSNL Q-5G – Quantum 5G’ను పరిచయం చేస్తున్నాం. మీ మద్దతు, ఉపయోగించడం వల్లే ఇది సాధ్యమైంది. ఇది కేవలం ఒక సేవ ప్రారంభం కాదు.. చరిత్ర సృష్టించిన సందర్భం” అని పేర్కొంది.

బీఎస్‌ఎన్‌ఎల్ మరో పోస్టులో ‘BSNL Quantum 5G FWA’ (ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్) సేవను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. బీఎస్‌ఎన్‌ఎల్ CMD, డైరెక్టర్లు, అన్ని సర్కిళ్ల జీఎంల సమక్షంలో ఈ సేవను ప్రారంభించారు. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించిన బ్యానర్ ప్రకారం, “BSNL Q-5G – The Quantum Leap” అనే ట్యాగ్‌లైన్‌తో పాటు, ఇది సిమ్ అవసరం లేకుండా పనిచేసే తొలి 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ సేవ అని వెల్లడించారు. తక్కువ ధరలో, అత్యధిక వేగంతో, నమ్మదగిన, భద్రమైన ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి వైర్లు అవసరం లేదు” అని తెలిపింది.

ఈ సేవలు ప్రస్తుతానికి ప్రత్యేకంగా కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలో, నగరాల్లోనే మాత్రమే లభించనున్నాయి. ఇది ఇంటర్నెట్ లీజ్ లైన్ సేవగా, ఏదైనా వ్యాపార సంస్థల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగితా వినియోగదారులకు ఇది అందుబాటులో ఉండదు. ప్రారంభ ధర రూ. 999గా నిర్ణయించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక లక్ష 4జీ టవర్లను బీఎస్‌ఎన్‌ఎల్ ఏర్పాటు చేసింది. వీటిలో సుమారు 70,000 టవర్లు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు వెల్లడించారు.