- నకిలీ లింక్‌లతో మోసాలు.. అప్రమత్తంగా ఉండండి
- ఫోన్ హ్యాక్ అయినట్టు కనిపించే లక్షణాలు ఇవే..!
- డిజిటల్ లోకంలో సురక్షితంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు

Hacking: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవనశైలిలో విడదీయరాని భాగంగా మారింది. బ్యాంకింగ్, కమ్యూనికేషన్, సోషల్ మీడియా, ఫొటోలు, పర్సనల్ డేటా.. అన్నింటికీ ఈ చిన్న డివైస్ ఆధారంగా మారింది. అయితే, టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ క్రైమ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. హ్యాకర్లు సరికొత్త మార్గాలను ఉపయోగించి ఫోన్‌లోని డేటాను చోరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
సాధారణంగా ఒక నకిలీ లింక్‌పై క్లిక్ చేయడం, అపరిచితమైన యాప్‌కు అనుమతి ఇవ్వడం వంటి చిన్న అజాగ్రత్తలతోనే ఫోన్ పూర్తిగా హ్యాక్ అవుతుంది. అయితే, కొన్ని లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, మీరు డేటా, డివైస్, డబ్బును కూడా రక్షించుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యే లక్షణాలు
1. ఫోన్ ఆన్-ఆఫ్ అవుతూ ఉండటం : మీ ఫోన్ ఎటువంటి కారణం లేకుండా పదే పదే స్వయంగా ఆన్ అవుతూ, ఆఫ్ అవుతూ ఉంటే.. అది రిమోట్ యాక్సెస్ ద్వారా ఎవరో ఫోన్‌ను నియంత్రిస్తున్న సూచన కావచ్చు.
2. బ్యాటరీ వేగంగా ఖాళీ అవటం : మీరు సాధారణంగా ఫోన్ వాడుతున్నా బ్యాటరీ చాలా త్వరగా ఖాళీ అవుతోందా? అప్పుడు మాల్వేర్ లేదా స్పైవేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మీ సమాచారం చోరీ చేస్తున్న అవకాశం ఉంది.
3. అపరిచిత నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు : చాలా సందర్భాల్లో హ్యాకింగ్ కారణంగా అనుమానాస్పద నంబర్ల నుంచి మీకు సందేశాలు లేదా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అలాగే, మీ ఫోన్ నుంచి మీకు తెలియకుండానే ఇతరులకు సందేశాలు వెళ్లడం కూడా హ్యాకింగ్ లక్షణమే.
4. ఫోన్ ఫ్రీజ్ అవ్వడం, ఆలస్యం కావడం : ఫోన్ పని చేయడంలో ఆటంకం ఏర్పడడం, స్వయంగా యాప్స్ ఓపెన్ అవ్వడం వంటి లక్షణాలు ఫోన్‌లో ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్ నిండి ఉందని సూచిస్తాయి.
5. డేటా వినియోగం అకారణంగా పెరగడం : మీ డేటా వినియోగం తేడా లేకుండా అకస్మాత్తుగా పెరిగిపోతే, మీ ఫోన్ నుంచి ఎవరో డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తున్న అవకాశాన్ని సూచిస్తుంది.
ఈ లక్షణాలు మీ ఫోన్‌లో కనిపిస్తే భయపడకండి. వెంటనే ఈ జాగ్రత్త చర్యలు తీసుకోండి:
- అపరిచిత లింక్‌లు క్లిక్ చేయవద్దు
- అనవసరమైన యాప్‌లను తొలగించండి
- ఫోన్‌కు సురక్షిత పాస్‌కోడ్ పెట్టండి
- ఫోన్‌ను రీసెట్ చేయడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది
- ఇంటర్నెట్ బ్యాంకింగ్, పర్సనల్ డేటా యాక్సెస్‌ను తాత్కాలికంగా ఆపేయండి
సాంకేతిక ప్రగతి మన జీవితాలను సులభతరం చేస్తోంది కానీ, అదే సమయంలో అప్రమత్తత లేకపోతే పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండవచ్చు.