- గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ..
- నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం
- ఆందోళన చేపట్టిన నేపాల్ యువత, ప్రజలు
సోషల్ మీడియాపై నేపాల్ లో నిషేధం ఎత్తివేశారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ఆ దేశం నిషేధం విధించింది. అయితే… అక్కడి ప్రజలు ఆందోళన చేపట్టడంతో… హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుపై నేపథ్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. ఓ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
సమావేశం అనంతరం ఆ దేశ కమ్యూనికేషన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేశారు. ‘జనరేషన్ జడ్’ డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విటర్), వాట్సప్ తదితర సైట్లు పనిచేయడం ప్రారంభించాయి. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఆందోళనకారులు నిరసన విరమించాలని మంత్రి కోరారు.
గడువు లోపల కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందుకు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డిన్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై గత గురువారం నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగష్టు 28 నుంచి ఏడు రోజుల్లోగా రిజిష్టర్ కావల్సి ఉంది. ఈ గడువు బుధవారం రాత్రి తీరిపోయినప్పటికి ఇంకా రిజిస్టర్ కాలేదు. దీంతో 26 సైట్లపై నిషేధం విధించింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. వెంటనే స్పందించిన యువత రాజధాని కాఠ్మండ్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్‌వైపు దూసుకు రావడంతో.. పోలీసులు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. అనంతరం ఈ కాల్పుల్లో 19 మంది చనిపోయారు. మరో 300 మందికి పైగా గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు.