Leading News Portal in Telugu

iPhone sales india where most iphones are sold 2025


  • నేడు ఐఫోన్ 17 సిరీస్ లాంచ్
  • ఐఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఎక్కడున్నారో తెలుసా?
  • అమ్మకాల్లో రెండవ స్థానంలో గుజరాత్

Maharashtra Tops the List in iPhone Sales: ప్రతి సంవత్సరం భారతదేశంలో కొత్త ఐఫోన్ లాంచ్ కోసం ‘యాపిల్’ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నేడు ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానుంది. ఇందుకోసం యాపిల్ కంపెనీ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఇండియాలో ఉన్న ఐఫోన్ లవర్స్ ఈ ఈవెంట్‌ను లైవ్‌గా రాత్రి 10:30 గంటల నుంచి చూడొచ్చు. యాపిల్ అధికారిక వెబ్‌సైట్ apple.comలో లైవ్ స్ట్రీమ్ అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్ ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. అయితే మనదేశంలో ఐఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఎక్కడున్నారో తెలుసుకుందాం.

ఐఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఎక్కువగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ మహారాష్ట్రలో గరిష్టంగా ఐఫోన్లు అమ్ముడవుతాయి. టాటా కంపెనీ క్రోమా నిర్వహించిన పరిశోధన ప్రకారం… సెప్టెంబర్ 2024-ఆగస్టు 2025 మధ్య భారతదేశంలో అమ్ముడైన మొత్తం ఐఫోన్లలో నాలుగో వంతు కంటే ఎక్కువ మహారాష్ట్రలో అమ్ముడయ్యాయి. ఇందులో ముంబై, పూణే సహా ఇతర ప్రాంతాలు ఉన్నాయి. 11 శాతం ఐఫోన్లు అమ్ముడైన గుజరాత్ రెండవ స్థానంలో ఉండగా.. 10 శాతంతో ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది.

దాదాపు 86 శాతం మంది సాధారణ ఐఫోన్‌లను కొనుగోలు చేశారు. ప్రో మోడళ్లకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి తొమ్మిది మందిలో ఎనిమిది మంది సాధారణ ఐఫోన్‌ను ఎంచుకున్నారు. ప్లస్, ప్రో మాక్స్ మోడళ్లను తక్కువగా కొనుగోలు చేశారు. స్టోరేజ్ విషయంకు వస్తే.. 128GB మోడల్ అత్యంత ప్రజాదరణ పొందింది. దాదాపు మూడింట ఒక వంతు మంది 128GB మోడల్ కొనుగోలు చేశారు. 256GB మోడల్ రెండో స్థానంలో ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఫోన్ కలర్ విషయానికి వస్తే.. బ్లాక్ కలర్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ తరువాత నీలం, తెలుపు ఉన్నాయి. యాపిల్ ఎన్ని కొత్త రంగులను విడుదల చేసినా.. జనాలు మాత్రం క్లాసిక్ రంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.