Leading News Portal in Telugu

Huge Queues for iPhone 17 Series in Delhi and Mumbai Apple Stores, Viral Video


  • రోజు ఉదయం నుంచి 17 సిరీస్‌ విక్రయాలు
  • యాపిల్‌ స్టోర్ల ముందు అర్ధరాత్రి నుంచే పడిగాపులు
  • సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న మీడియా

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం ‘యాపిల్‌’ ఇటీవల ఐఫోన్‌ 17 సిరీస్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఐఫోన్‌ 17 ఎయిర్‌ను లాంచ్ చేసింది. ఇక భారత టెక్‌ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి 17 సిరీస్‌ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ లవర్స్ యాపిల్‌ స్టోర్ల ముందు భారీగా బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

దేశరాజధాని ఢిల్లీ సాకేత్‌లోని సెలెక్ట్ సిటీ మాల్‌లో ఐఫోన్ 17 కొనడానికి ప్రజలు గురువారం అర్ధరాత్రి నుంచే యాపిల్‌ స్టోర్ ముందు క్యూలో నిలబడ్డారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని యాపిల్‌ స్టోర్ వెలుపల వేలాది మంది నిలబడ్డారు. కొందరు 7-8 గంటలుగా క్యూలో వేచి ఉన్నారు. ఇందులోని చాలా మంది ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్నారు. బుక్ చేసుకోలేని వారు కూడా ఐఫోన్ 17 దక్కుతుందనే ఆశతో క్యూలో నిలబడి ఉన్నారు. ఐఫోన్‌ 17 ప్రో మాక్స్‌ను కొనుగోలు చేసిన ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. తెగ సంతోషపడ్డాడు. గత 6 నెలలుగా ఐఫోన్ కొనుగోలు చేసేందుకు ఏంటో ఆశగా ఎదురుచూశానని చెప్పాడు. భారీ క్యూ లైన్స్ చూసి.. ‘ఈ క్రేజ్ ఏంట్రా బాబు’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈసారి ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్ల బేస్‌ స్టోరేజీ 256 జీబీగా యాపిల్‌ తీసుకొచ్చింది. 17 సిరీస్‌ అన్ని ఫోన్లు ఐఓఎస్ 26 ఆధారంగా పనిచేయనున్నాయి. అన్ని ఫోన్లలో 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. వీటిలో సెరమిక్‌ షీల్డ్‌ 2 ప్రొటెక్షన్‌ ఇచ్చారు. గత ఐఫోన్లతో పోలిస్తే ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌ ఇచ్చారు. ఐఫోన్‌ 17 ధర రూ.82,900 కాగా.. ఎయిర్‌ మోడల్‌ ధర రూ.1,19,900గా ఉంది. ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,34,900గా.. ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,49,900గా కంపెనీ పేర్కొంది.