- ఐకూ నుంచి మరో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్
- చైనా మార్కెట్లోకి ఐకూ 15 విడుదల
- 7000mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాలు
వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ మరో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం ‘ఐకూ 15’ని కంపెనీ లాంచ్ చేసింది. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఇది ఐకూ నుంచి రిలీజ్ అయిన అత్యంత శక్తివంతమైన ఫోన్. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఐకూ 15 ధర, ఇతర ఫీచర్స్ ఏంటో తెల్సుకుందాం.
ఐకూ 15లో 6.85-అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ 6000 నిట్‌ల గరిష్ట ప్రకాశం, 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 12GB, 16GB RAM, 1TBతో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6.0 పై రన్ అవుతుంది. ఈ డ్యూయల్-సిమ్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ లెన్స్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.
ఐకూ 15లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీ, 100W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ చైనీస్ మార్కెట్లో ఐదు కాన్ఫిగరేషన్లలో, ఒక ప్రత్యేక ఎడిషన్‌లో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్ 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర 4,199 యువాన్లు (సుమారు రూ. 51,780)గా ఉంది. టాప్ వేరియంట్ 16GB RAM, 1TB స్టోరేజ్ ధర 5,499 యువాన్లు (సుమారు రూ. 67,830)గా కంపెనీ పేర్కొంది.