Leading News Portal in Telugu

France Launches World’s First Wireless Charging Highway for Electric Vehicles


  • ఛార్జింగ్ టెన్షన్ లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు
  • ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్‌వే ఫ్రాన్స్‌
  • ఫ్రాన్స్ దేశం మరో చారిత్రాత్మక అడుగు
  • రన్నింగ్‌లో రోడ్డుపైనే ఛార్జింగ్

మీ ఎలక్ట్రిక్ కారు హైవేపై వేగంగా దూసుకుపోతుంటే.. ఆటోమేటిక్‌గా బ్యాటరీ ఛార్జ్ అవుతుందని ఓసారి ఊహించుకోండి. ఆ ఊహ ఎంతో బాగుంది కదా?. కేబుల్స్ పెట్టకుండా, ఛార్జింగ్ స్టేషన్లు లేకుండా, వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మీ ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ అవుతుంది. మీరు చూస్తుంది నిజమే.. ఇది ఫ్రాన్స్‌లో జరుగుతోంది. రన్నింగ్ వాహనాలను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్‌వే ఫ్రాన్స్‌లో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ప్రయోగం సాంకేతికంగా విప్లవాత్మకమైనది మాత్రమే కాదు.. భవిష్యత్ రోడ్లకు బ్లూప్రింట్‌ను కూడా అందిస్తుంది.

ఫ్రాన్స్ దేశం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. డైనమిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్‌తో కూడిన మొట్టమొదటి మోటార్‌వేను ప్రారంభించింది. ఈ సాంకేతికతతో ఎలక్ట్రిక్ వాహనాలు రన్నింగ్‌లోనే ఛార్జ్ అవుతాయి. ఛార్జింగ్ స్టేషన్లలో కార్లు లేదా ట్రక్కులు ఆపాల్సిన అవసరం ఇక లేదు. ఈ ప్రయోగం పారిస్‌కు నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న A10 మోటార్‌వేపై ప్రారంభమైంది. VINCI ఆటోరౌట్స్ నేతృత్వంలో ఎలక్ట్రియన్, విన్సీ కన్‌స్ట్రక్షన్‌, గుస్టావ్ ఐఫెల్ యూనివర్సిటీ సహా హచిన్సన్ వంటి సంస్థలు ‘ఛార్జ్ యాజ్ యు డ్రైవ్’ అనే ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేశాయి.

సుమారు 1.5 కిలోమీటర్ల పొడవున్న A10 మోటార్‌వే లోపల పొందుపరచబడిన కాయిల్స్ ఉన్నాయి. ఈ కాయిల్స్ మీదుగా ప్రయాణించే ట్రక్కులు, బస్సులు, ప్యాసింజర్ కార్లు, యుటిలిటీ వాహనాలు.. లాంటి ఎలక్ట్రిక్ వాహనాలు రన్నింగ్‌లో ఉన్నప్పుడు విద్యుత్తును పొందుతాయి. ట్రయల్స్ ఇప్పటికే విజయవంతమయ్యాయి. నివేదికల ప్రకారం.. ఈ మోటార్‌వే 300 కిలోవాట్ల గరిష్ట శక్తి, 200 కిలోవాట్ల సగటు శక్తి బదిలీ సామర్థ్యాన్ని అందించింది. విన్సీ ఆటోరౌట్స్ సీఈఓ నికోలస్ నోటెబియర్ మాట్లాడుతూ… ‘ఫ్రాన్స్ ప్రధాన రహదారి నెట్‌వర్క్‌లోని ఛార్జింగ్ స్టేషన్‌లతో పాటు ఈ సాంకేతికతను అమలు చేస్తే.. భారీ వాహనాల విద్యుదీకరణ వేగం మరింతగా పెరుగుతుంది. ఇది కార్బన్ ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది’ అన్నారు.

డైనమిక్ ఇండక్షన్ ఛార్జింగ్‌లో రోడ్డు ఉపరితలం కింద విద్యుదయస్కాంత కాయిల్స్‌ను ఉపయోగించారు. ఎలక్ట్రిక్ వాహనం ఈ కాయిల్స్ మీదుగా వెళ్ళినప్పుడు.. విద్యుత్తు అయస్కాంత క్షేత్రం ద్వారా వాహనంపై ఉన్న రిసీవర్‌కు శక్తి ప్రసారం చేయబడుతుంది. ఈ శక్తి నేరుగా మోటారుకు శక్తినిస్తుంది లేదా బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. వాహనం ఛార్జింగ్ కోసం ఆగాల్సిన అవసరం లేదు. ప్రయాణ సమయంలోనే ఛార్జింగ్ అవుతుంది. ఇది వాహన డౌన్‌టైమ్‌ను తగ్గించడమే కాకుండా.. చిన్న, తేలికైన బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు. తక్కువ బ్యాటరీలు ఉండే ట్రక్కుల వంటి భారీ వాహనాలకు ఇది బాగా ఉపయోగపడనుంది. రోడ్డు కింద ఇన్‌స్టాల్ చేయబడిన ట్రాన్స్‌మిట్ కాయిల్, వాహనంలో ఇన్‌స్టాల్ చేయబడిన రిసీవర్ కాయిల్ మధ్య శక్తి మార్పిడి సెన్సార్లు, సాఫ్ట్‌వేర్ ద్వారా నిజ సమయంలో నియంత్రించబడుతుంది. ఇతర దేశాలు కూడా ఈ దిశగాముందుకు వెళుతున్నాయి. జర్మనీ 1 కిలోమీటర్ పొడవైన ట్రయల్‌ను ప్రారంభించబోతోంది.