Leading News Portal in Telugu

TRAI Approves CNAP Service: Caller Name Presentation to Curb Spam Calls in India


TRAI: భారత టెలికమ్యూనికేషన్ రంగంలో ఒక కీలక మార్పు రాబోతోంది. ఇకపై కాల్ వచ్చే సమయంలో నంబర్‌తో పాటు కాలర్ పేరు కూడా కచ్చితంగా కనిపించేలా ట్రాయ్ (TRAI) CNAP సేవకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పామ్ కాల్స్‌ను అరికట్టే దిశగా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవను డీఫాల్ట్ ఫీచర్‌గా ప్రవేశపెట్టాలని ట్రాయ్ అంగీకరించింది. అక్టోబర్ 28న విడుదలైన ఈ నిర్ణయం ప్రకారం ఇకపై కాల్ చేసిన వారి పేరు నంబర్‌తో పాటు రిసీవ్ చేసుకొనే వ్యక్తికి స్పష్టంగా కనిపిస్తుంది.

Cyclone Montha: తుఫాన్‌ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

ఈ సేవ అమలుకు సంబంధించిన చర్చలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. 1997 TRAI చట్టంలోని సెక్షన్ 11(1)(a) ప్రకారం CNAP సేవ సాధ్యాసాధ్యాలపై సిఫార్సులు ఇవ్వాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) 2022 మార్చిలో ట్రాయ్‌ను సంప్రదించింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో ట్రాయ్ తన తొలి సిఫార్సులను సమర్పించగా.. 2025 సెప్టెంబరులో DoT పునఃపరిశీలన కోరింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజాగా ఇచ్చిన సమాధానంలో ప్రభుత్వ సూచనలను పరిగణనలోకి తీసుకుని కొన్ని కీలక మార్పులతో తన మునుపటి సిఫార్సులను పునరుద్ధరించింది.

CNAP సేవ ప్రధానంగా మోసపూరిత, స్పామ్ కాల్స్‌ను అరికట్టడమే లక్ష్యంగా దశలవారీగా ప్రవేశపెట్టబడుతుంది. ఇది అన్ని వినియోగదారులకూ డీఫాల్ట్‌గా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, అవసరమైతే ఆప్షనల్‌గా డిసేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారుల పేర్లు KYC ధృవీకరించిన వివరాల ఆధారంగా చూపిస్తాయి. లైసెన్సింగ్ నియమాల్లో కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ (CLI) నిర్వచనాన్ని విస్తరించి.. కాలింగ్ నేమ్ (CNAM)ను కూడా చేర్చనున్నారు. గోప్యత రక్షణలో భాగంగా.. CLIR ఎంచుకున్న వినియోగదారుల పేర్లు మాత్రం ప్రదర్శించబడవు.

మిలిటరీ గ్రేడ్ మన్నిక, 7000mAh బ్యాటరీ, Snapdragon 7s Gen 2తో వచ్చేస్తున్న Moto G67 Power స్మార్ట్‌ఫోన్!

వ్యాపార వినియోగదారులు తమ ట్రేడ్ నేమ్ లేదా ట్రేడ్‌మార్క్‌ను కాలర్ ఐడెంటిటీగా చూపించుకునే వీలు ఉంటుంది. కానీ, అది ప్రభుత్వ ధృవీకరణ ప్రక్రియకు లోబడి ఉంటుంది. అలాగే కొత్త మొబైల్ పరికరాల్లో CNAP ఫీచర్ తప్పనిసరిగా ఉండేలా MeitY (ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ) తో సమన్వయం చేయాలని ట్రాయ్ ప్రకటించింది. ఈ సేవను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ITU, ETSI మార్గదర్శకాలకు అనుగుణంగా సప్లిమెంటరీ సేవగా వర్గీకరించారు. ట్రాయ్ తాజా నిర్ణయం మేరకు DoT టెలికాం ఆపరేటర్లకు ఒక వారంలో కనీసం ఒక సర్కిల్‌లో CNAP సేవ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత 60 రోజుల పైలట్ దశ పూర్తి చేసిన అనంతరం దేశవ్యాప్త రోల్‌అవుట్ జరగనుంది. ఈ కొత్త మార్పు ద్వారా కాల్ ట్రాన్స్‌పరెన్సీ పెరగడం, స్పామ్ లేదా మోసపూరిత కాల్స్‌ను సమర్థవంతంగా అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు.