Leading News Portal in Telugu

Google AI Pro Subscription Free for Jio Users


  • జియో కస్టమర్లకు ముఖేష్ అంబానీ క్రేజీ గిఫ్ట్
  • రూ.35,100 విలువైన గూగుల్ AI ప్రో ఉచితంగా

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), గూగుల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీని ద్వారా భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని వేగంగా పెంచడానికి రెండు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. ఈ భాగస్వామ్యం జియో వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ AI ప్రో ప్లాన్‌కు ఉచిత యాక్సెస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఒక్కో వినియోగదారునికి దాదాపు రూ.35,100 విలువైనదని జియో చెబుతోంది. గూగుల్ AI ప్రోతో, జియో వినియోగదారులు గూగుల్ జెమిని 2.5 ప్రో, తాజా నానో బనానా, వీయో 3.1 మోడళ్లతో ఫోటోలు, వీడియోలను సృష్టించడానికి అనుమతి పొందుతారని జియో తెలిపింది. ఇందులో స్టడీ అండ్ రీసెర్చ్ కోసం నోట్‌బుక్ LMకి విస్తరించిన యాక్సెస్, 2 TB క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రీమియం సేవలు కూడా ఉన్నాయి.

ఈ ఫీచర్‌ను మొదటగా 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల జియో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు జియో పేర్కొంది. తరువాత, అందరు జియో వినియోగదారులకు యాక్సెస్ లభిస్తుంది. 5G అపరిమిత ప్లాన్‌లతో జియో కస్టమర్లకు మాత్రమే కంపెనీ ఈ ఉచిత యాక్సెస్‌ను అందిస్తుందని గమనించాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, “1.45 బిలియన్ల భారతీయులకు AI సేవలను అందించడమే మా లక్ష్యం. గూగుల్ వంటి భాగస్వాములతో కలిసి, భారతదేశాన్ని AI-ఎనేబుల్డ్ చేయాలనుకుంటున్నాము” అని అన్నారు.

18, 25 సంవత్సరాల మధ్య వయస్సు గల జియో యూజర్ అయితే, రాబోయే రోజుల్లో మీరు ఈ ఉచిత ఆఫర్‌కు అర్హులు అవుతారు. అయితే, మీ మొబైల్ ప్లాన్ అపరిమిత 5Gతో కూడినదిగా ఉండాలి. గూగుల్ AI ప్రోను అన్ని రకాల వినియోగదారులకు తీసుకువస్తామని కంపెనీ స్పష్టం చేసింది, అయితే ప్రారంభంలో, ఈ సబ్‌స్క్రిప్షన్ యువతకు మాత్రమే అందించనుంది.