Samsung Galaxy S26 Launch: Samsung Galaxy S26 Ultra Will Get 200MP Camera, 5400mAh Battery, AI Features
 
- త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
 - ఫిబ్రవరి 2026 చివరలో ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్
 - గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా రిలీజ్
 
దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ కంపెనీ ‘శాంసంగ్’ త్వరలో గెలాక్సీ S26 సిరీస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం… ఫిబ్రవరి 2026 చివరలో ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌ను కంపెనీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రాలను రిలీజ్ చేయనునట్లు తెలుస్తోంది. ఈవెంట్ ఫిబ్రవరి 25న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుందని సమాచారం. 3 సంవత్సరాల తర్వాత శాంసంగ్ తన లాంచ్ ఈవెంట్‌ను మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో ఇప్పుడు AIకి కేంద్రంగా మారినందున ఈవెంట్‌కు సరైన ప్రదేశంగా శాంసంగ్ భావిస్తోంది.

శాంసంగ్ కంపెనీ సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి ప్రారంభంలో తన ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ప్రారంభిస్తుంది. కానీ ఈసారి షెడ్యూల్‌ను మార్చారు. ప్రొడక్షన్ కారణంగా ఈ మార్పు జరిగినట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. గెలాక్సీ ఎస్26 అల్ట్రా కొత్త AI ప్రైవసీ స్క్రీన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ మీ కంటి చూపును సురక్షితంగా ఉంచుతుంది. ఈ సిరీస్ శాంసంగ్ స్వంత Exynos 2600 చిప్‌సెట్ (2nm ప్రాసెస్)ను కలిగి ఉంటుంది. అయితే కొన్ని దేశాలలో Snapdragon 8 Elite Gen 5 (3nm ప్రాసెస్) చిప్‌సెట్‌తో వస్తుంది.

గెలాక్సీ ఎస్26 అల్ట్రా 6.9-అంగుళాల Quad HD M14 OLED డిస్‌ప్లే, 5400mAh బ్యాటరీ, 200MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP టెలిఫోటో లెన్స్ (5X ఆప్టికల్ జూమ్), కొత్త అల్ట్రావైడ్ కెమెరాను కూడా కలిగి ఉంటుందని సమాచారం. గెలాక్సీ S26, S26+ వరుసగా 6.3-అంగుళాల, 6.7-అంగుళాల డిస్ప్లేలు, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌లు కలిగి ఉండనున్నాయి. అలానే 4300mAh, 4900mAh బ్యాటరీలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. గెలాక్సీ S26 సిరీస్ కంపెనీ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత అధునాతన ఫోన్లలో ఒకటి కావచ్చు. AI ఫీచర్లు, శక్తివంతమైన కెమెరాలు, శక్తివంతమైన చిప్‌సెట్‌లతో ఈ సిరీస్ 2026లో అత్యంత ప్రజాదరణ పొందిన లాంచ్‌లలో ఒకటిగా నిలవనుంది.
