చార్జింగ్ లేకుండా సోలార్ పవర్ బ్యాంక్స్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నగర మార్కెట్‌లో సరికొత్త వెరైటీ పవర్ బ్యాంక్స్ హల్‌చల్ చేస్తున్నాయి. సాధారణంగా ఉండే పవర్ బ్యాంక్‌ల స్థానంలో మల్టీయూజబుల్‌గా ఇవి ఉపయోగపడతాయి. విద్యుత్ అవసరం లేకుండా సోలార్‌తో పనిచేసే పవర్ బ్యాంక్‌లు ప్రత్యేకం. కొద్దిగా వెలుతురులో ఉంచితే చాలు.. ఈ పవర్ బ్యాంక్ చార్జ్ అవుతుంది. ఎల్‌ఈడీ దీపాలు వెలిగే మరో పవర్ బ్యాంక్ కూడా అందుబాటులోకి వచ్చింది.
అధిక సామర్థ్యంతో…
తాజా పరిస్థితుల నేపథ్యంలో పవర్ బ్యాంక్స్ కూడా నిత్యావసరమైపోయాయి. అత్యవసర సమయంలో ఫోన్ చార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడకుండా ఇంటెక్స్, లెనోవా సంస్థలు భారీ కెపాసిటీతో కూడిన పవర్ బ్యాంక్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. ఇవి స్టైలిష్‌గా కూడా ఉండటం వల్ల యువత ఎక్కువగా కొంటోంది. ఈ పవర్ బ్యాంక్స్ 5,000, 10,000, 15,000, 20,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో పనిచేస్తాయి.
మార్కెట్‌లో సోనీ, శామ్‌సంగ్ వంటి కంపెనీల పవర్ బ్యాంక్స్ అందుబాటులోకి వచ్చినా ఇంటెక్స్, లెనోవాకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ధర తక్కువతో పాటు మన్నిక ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రూ.700 నుంచి రూ.1,500లోపు ఈ పవర్ బ్యాంక్‌లు లభిస్తున్నాయి. కంపెనీల పవర్ బ్యాంక్స్ రూ.3వేలు ఆపైనే పలుకుతున్నాయి. ఈ పవర్ బ్యాంక్స్ సంగతి అలా ఉంచితే.. మార్కెట్‌లోకి వస్తున్న మల్టీ పవర్ బ్యాంక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.