‘ఉమాంగ్’ తో ఉపయోగాలెన్నో…
జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి అనేక సేవలను ఇప్పుడు అరచేతిలోనే ఆండ్రా యిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఇందుకోసం సరికొత్త ఉమంగ్ యాప్ ద్వారా విస్తృత సేవలు అందనున్నాయి. తాజాగా డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గ్లోబల్ కాన్ఫ్‌రెన్స్ సైబర్ స్పేస్ ఆధ్వర్యంలో ఉమంగ్ (యునిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) యాప్ ఆవిష్కరించారు. ఇందులో పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లను మాత్రమే అనుసంధానం చేశారు. ఉమంగ్ యాప్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు సంబంధించిన 160కి పైగా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని రాష్ట్రాల పథకాలను అనుసంధానం చేశారు. ఈ యాప్‌ను కేంద్రం ఇటీవల విడుదల చేయగా, స్మార్ట్ ఫోన్‌లోనే కాక కంప్యూటర్లలో కూడా ఉపయోగించే వెసులుబాటు కల్పించారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 1800115246 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఇన్‌స్టాల్ ఇలా
ఉమంగ్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్‌నెంబర్‌తో లాగిన్ కావాలి. అ తర్వాత ఒక కోడ్ వస్తుంది. కోడ్ వచ్చాక అనుసంధానం కావాలి. ఈ మెయిల్‌కు సైతం అనుసంధానం చేశాక నాలుగు అంకెల పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. తర్వాత వ్యక్తి గత వివరాలు నమోదు చేస్తే యాప్ వినియోగంలోకి వస్తుంది. మనకు కావాల్సిన పథకం సమాచారం తెలుసుకోవచ్చు.
ఉమంగ్‌తో ఎంతో ఉపయోగం
ఉమంగ్ యాప్‌లో ఆధార్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు డీజీ లాకర్ ద్వారా లాగిన్ కావాలి. ప్రస్తుతం 160 సేవలు అందుబాటులో ఉండగా, భవిష్యత్‌లో 1200 సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా ఉద్యోగుల భవిష్య నిధి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు, రైతుల పంటల వివరాలు తెలుసుకోవచ్చు. ఐటీ శాఖకు ఆదాయ పన్ను చెల్లించవచ్చు. ఉపకార వేతనాలు, ఆధార్‌కార్డులో తప్పొప్పులు సవరణలు, ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఈ-పుస్తకాలు, జాతీయ పెన్షన్ విధానం, పంటల బీమా తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉమంగ్ సేవలను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. ఒకేయాప్‌లో వందల రకాల సేవలను పొందేలా ఉండటం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.