Leading News Portal in Telugu

రెడీ.. వన్‌.. టూ.. త్రీ..

విమానాశ్రయాన్ని మూసేసి..!
కొద్దినెలల క్రితం మైసూరు విమానాశ్రయం ఓ రెండు గంటలపాటు మూతపడింది. విమానాల రాకపోకలపై ఆంక్షలు పెట్టేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా. విమానయాన శాఖ, కొన్ని స్టార్టప్‌ కంపెనీలు డ్రోన్లను పరీక్షించాయి. బెంగళూరుకు చెందిన స్కైలార్క్‌ ఇంజనీర్లు భద్రతా రంగంలో డ్రోన్లను మరింత సమర్థంగా ఎలా వాడవచ్చు, వేర్వేరు రంగాల్లో డ్రోన్ల వినియోగంతో వచ్చే లాభాలేమిటి అన్న అంశాలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రత్యక్షంగా చూపారు. డ్రోన్లతో భారత్‌ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సామాజికంగా మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పెను మార్పులకు డ్రోన్లు ఉపయోగపడతాయని అంచనా.

ఇప్పటికే 40 వేలకుపైగా డ్రోన్లు
ప్రైవేటు వ్యక్తులు వినియోగించడంపై ఆంక్షలు ఉన్నా.. మన దేశంలో ఇప్పటికే 40 వేలకుపైగా డ్రోన్లు ఉన్నట్టు అంచనా. 2022 నాటికి ప్రపంచం మొత్తమ్మీద డ్రోన్ల వాడకం రెట్టింపు అవుతుందని, వాటి మార్కెట్‌ 10 వేల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క యూరప్‌లోనే లక్షా 50 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు డ్రోన్లు కారణమవుతాయని అంచనా. డ్రోన్లు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారు అవసరమవుతారు. అలాగే అనవసరమైన డ్రోన్లను కూల్చేసేందుకు నిపుణుల అవసరం ఉంటుంది. ఆయా రంగాల్లోని అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

డ్రోన్లతో వ్యవ’సాయం’
మట్టి నాణ్యతని పరీక్షించి, సాగు చేసుకోదగ్గ పంటలపై సూచనలు ఇవ్వడం మొదలుకొని… దిగుబడులను అంచనా వేయడం వరకు డ్రోన్లు వ్యవసాయానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. పంట పొలాల్లోని ప్రతి మొక్క, చెట్లను ఫొటోలు తీసి.. విశ్లేషించి వాటి ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. పొలంలోని ఏభాగంలో పోషకాల కొరత ఉందో.. ఎక్కడ ఎక్కువైందో తెలుసుకోవచ్చు. ఎరువులు, కీటకనాశినులను సమర్థంగా, తక్కువ సమయంలో పొలమంతా చల్లేందుకు డ్రోన్లను వాడుకోవచ్చు. ఇక విత్తనాలు నాటే డ్రోన్లు కూడా వస్తున్నాయి. చైనా, జపాన్‌ వంటి దేశాలు వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. మనదేశంలో పంజా బ్, కర్ణాటక తదితర రాష్ట్రాల రైతులు డ్రోన్లను వినియోగించడం మొదలుపెట్టారు. ఇక డ్రోన్ల సహాయంతో క్లౌడ్‌ సీడింగ్‌ చేయడం ద్వారా కరువు ప్రాంతాల్లో వర్షాలు కురిపించడం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ చర్యలు, అభయారణ్యాల్లో వేటగాళ్ల నుంచి జంతువుల సంరక్షణకు డ్రోన్లను విస్తృతంగా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డ్రోన్లపైనా నిఘా పెడతాయి
డ్రోన్లు ఉగ్రవాదుల చేతుల్లో పడితే అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించవచ్చన్న భయం ఇన్నాళ్లూ వెంటాడేది. ఇప్పుడు అలాంటి ఆందోళనలు లేవు. శత్రు డ్రోన్లకు అడ్డుకట్టే వేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇలా పక్కదారిపట్టే డ్రోన్ల ఆచూకీ కనిపెట్టడానికి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఇఎల్‌) శక్తిమంతమైన రాడర్లు, జామర్లను రూపొందించింది. విమానాశ్రయాలు, పార్లమెంటు, సరిహద్దు ప్రాంతాలు, సైనిక శిబిరాలు వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల డ్రోన్లతో ఎవరైనా దాడికి దిగుతారన్న భయం ఉండ దు. ప్రస్తుతం 3 కిలోమీటర్ల పరిధిలో ఉండే డ్రోన్లను మాత్రమే ఈ టెక్నాలజీ ద్వారా పసిగట్టవచ్చు. ఈ పరిధిని పెంచడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.

అవయవ రవాణాతో ప్రాణదానం
అవయవాలను దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలపవచ్చన్న అవగాహన ఈ మధ్య కాలంలో అందరిలోనూ పెరుగుతోంది. కానీ అవయవాలను సకాలంలో అవసరమైన చోటికి సరఫరా చేయడం సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఊరి నుంచి మరో ఊరికి రవాణా, ట్రాఫిక్‌ జామ్‌లు వంటి ఇబ్బందులు లేకుండా అవయవాలను సరఫరా చేయడానికి డ్రోన్లు ఉపయోగపడతాయి. గుండె, కాలేయం వంటి అవయవాలను డ్రోన్ల సాయంతో తరలించడానికి అవసరమయ్యే తక్కువ బరువున్న సరికొత్త బాక్స్‌ను శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఇక మీదట ఈ అంబులెన్స్‌ డ్రోన్లు మనుషుల ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడతాయి.

హింసాత్మక ఘటనలకు చెక్‌!
జాతరలు, ఉత్సవాలు, సభలు సమావేశాల సమయాల్లో భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్లను వినియోగించడం ఇప్పటికే మొదలైంది. అంతేకాదు అలాంటి కార్యక్రమాల్లో ఎవరైనా హింసకు పాల్పడే అవకాశాలుంటే.. ముందుగానే గుర్తించి, హెచ్చరికలు జారీ చేసేలా డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ రకమైన డ్రోన్లు రెండు కెమెరాల సాయంతో వీడియోలు తీయడమే కాకుండా.. ఐదు రకాల ముఖ కవళికలు, చర్యల ఆధారంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తిస్తాయి. తన్నడం, పిడిగుద్దులు, పొడవడం, కాల్చడం వంటి చర్యలను కూడా ఇవి గుర్తించగలవు. తద్వారా సమస్య పెద్దది కాకముందే అధికారులు రంగంలోకి దిగేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వరంగల్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (బెంగళూరు) శాస్త్రవేత్తలు వీటిని వచ్చే నెలలో పరీక్షించనున్నారు.

శత్రు స్థావరాలపై కిల్లర్‌ డ్రోన్ల నిఘా
వందేళ్ల క్రితం మిలటరీ అవసరాల కోసమే తయారు చేసిన డ్రోన్లు.. ఇప్పుడు చాలా శక్తిమంతంగా తయారయ్యాయి. ప్రస్తుతం భారత సైన్యం దగ్గర 200కి పైగా డ్రోన్లు ఉన్నాయి. కొన్ని డ్రోన్లను సరిహద్దుల్లో గస్తీ కోసం వినియోగిస్తుండగా.. శత్రుస్థావరాలపై నిఘా పెట్టే విదేశీ రాడార్లను పసిగట్టే కిల్లర్‌ డ్రోన్లను ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేశారు. ఇక రూ. 2,650 కోట్ల వ్యయంతో డీఆర్‌డీవో సొంతంగా డ్రోన్ల తయారీ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. యుద్ధభూమిలో వినియోగిం చడానికి మరో 400 డ్రోన్ల అవసరముందని రక్షణ శాఖ అంచనా వేస్తోంది?