Leading News Portal in Telugu

పీసీ సరిగా పనిచేయడం లేదా, అయితే ఇది చూడండి

ఎన్ని వేలు పెట్టి కొనుగోలు చేసిన కంప్యూటర్లైనా, ల్యాప్‌ట్యాప్‌లైనా వాడే కొద్ది నెమ్మదిస్తుంటాయి. పనిచేయకుంటే వెంటనే సర్వీసింగ్‌ సెంటర్‌ను ఆశ్రయిస్తుంటాం. వీటిల్లో ముఖ్యంగా బూటింగ్‌, హ్యాంగింగ్‌, హార్డ్‌డిస్క్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలు తలెత్తుంటాయి. ఒకసారి కంప్యూటర్‌లో వైరస్‌ ప్రవేశించిన తర్వాత దానిని తొలగించడం సులువు కాదు. అందుకోసం హార్డ్‌డిస్క్‌ను ఫార్మాట్‌ చేసి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అలా కాకుండా పార్టీషన్‌ ఉపయోగిస్తే శ్రమ తగ్గుతుంది. అంటే.. పీసీని కొని అందులో సాఫ్ట్‌వేర్‌లు, యాంటీ వైరస్‌ వంటివి ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత పార్టీషన్‌ క్లోనింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. దీని ద్వారా సీ డ్రైవ్‌ మొత్తాన్ని ఓ డిస్క్‌ ఫైల్‌లా వేరే హార్డ్‌ డిస్క్‌లో భద్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కంప్యూటర్‌లో వైరస్‌ వచ్చినపుడు భద్రపరుచుకున్న సీడీ ద్వారా మొత్తం బూట్‌ చేసుకుంటే సరి. యథావిధిగా సీడ్రైవ్‌లో అన్ని సాఫ్ట్‌వేర్‌లు ఏ సమస్య లేకుండా పని చేస్తాయి.

ఎలాంటి కంప్యూటర్‌ లోనైనా పీసీ పని తీరు నెమ్మదిస్తుంటుంది. పాత కంప్యూటర్‌లలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ప్రాసెసర్‌కు తగిన ర్యామ్‌ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. హై ఎండ్‌ ప్రాసెసర్‌లలో ర్యామ్‌ చాలా కీలకం. లేదంటే సీపీయూ మెమోరీని ఉపయోగించుకుంటూ ఉంటుంది. దీని వల్ల హ్యాంగింగ్‌ సమస్య ఏర్పడుతుంది. ప్రాసెసర్‌కు తగిన అదనపు ర్యామ్‌ను జోడిస్తే సమస్య పరిష్కారమవుతుంది.

పీసీకి సంబంధించి ఎలాంటి ఆప్షన్‌ చేస్తున్నా మొదట ముఖ్యమైన సమాచారాన్ని ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌లోకి బ్యాక్‌అప్‌ తీసుకుంటే మంచిది. ప్రస్తుతం క్లౌడ్‌ సర్వీసులు ఎక్కువగా ఉంటున్నాయి. అవసరం అనుకుంటే డబ్బు చెల్లించి ఇలాంటి సౌకర్యాన్ని యాక్సెక్‌ చేసుకుంటే ఉత్తమం. ఇలా చేస్తే, అత్యవసరంగా కంప్యూటర్‌ లేదా ల్యాప్‌ట్యాప్‌ను ఫార్మాట్‌ చేయాల్సి వచ్చినా డేటా నష్టం వాటిల్లదు. పెద్ద సమస్యగానూ అనిపించదు. ఫార్మాట్‌ చేసి ఓఎస్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని మిగిలిన డేటాను క్లౌడ్‌ నుంచి తీసుకోవచ్చు.

చాలా వరకు విండోస్‌నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో సిస్టం రీస్టోర్‌ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి కంప్యూటర్‌లో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఐదు రీస్టోర్‌ పాయింట్లను ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటుంది. అధిక శాతం వైరస్‌లు, ఇతర ప్రమాదకరమైన అంశాలు కంప్యూటర్‌లోకి చొరబడినపుడు గుర్తించలేం. అవి సిస్టమ్‌లోని ఆయా ఫోల్డర్లతో దాగి ఉంటాయి. అలా ఉండి రహస్యంగా వాటి ప్రభావం చూపిస్తుంటాయి. ఇవి ఎప్పటికప్పుడు పేర్లు మార్పు చేసుకుంటూ యాంటీ వైరస్‌ గుర్తించలేకుండా మార్పులు చెందుతుంటాయి. ఒకసారి చొరబడితే గుర్తించడం చాలా కష్టం. అందువల్ల సిస్టమ్‌ రీస్టోర్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల ఫైల్స్‌కు సమస్య ఏర్పడితే వెంటనే రీస్టోర్‌లో ఉన్న ఫైల్స్‌ను ఉపయోగంచుకోవచ్చు.