భద్రాద్రి కొత్తగూడెం క్లబ్ లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నియోజకవర్గం ప్రత్యక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలో మళ్ళీ నేనే పోటీ చేస్తా, కేసీఆర్‌తో ఇటీవల జరగిన సమావేశంలో కేసీఆర్ హామీ ఇచ్చారని వనమా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. కొత్తగూడెంలో వందల కోట్లు నిధులు మంజూరు తో నిర్దేశించిన పనులు వేగంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన వనమా.. 25 రోజులలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులకు తెలపటం చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఆయన పదవి విషయంలో సుప్రీంకోర్టు నుంచి స్టే లభించిన అనంతరం తొలిసారి గత గురువారం ఆయన కొత్తగూడెంకు రాగా, జూలూరుపాడు వద్ద ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్తగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ, దేవుడి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్, కేటీఆర్తో పాటు కార్యకర్తలు, ప్రజల అండతో తనకు అంతా మంచే జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల కోసం నేటి నుంచే కార్యాచరణకు దిగుతానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారని, జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటానని అన్నారు.