మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరులు తెల్లం వెంకట్రావు, పినపాక, అశ్వారావుపేట, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రేపు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్ లో రేపు ఉదయం 10 గంటలకు విప్, కొత్తగూడెం బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ నాయకులు. వీరికి మంత్రి హరీష్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
తెల్లం వెంకట్ రావు గతంలో BRSలో ఉన్నారు. 2018 ఎన్నికలలో భద్రాచలం (ST) అసెంబ్లీ స్థానానికి పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి విఫలమయ్యారు. అంతకుముందు 2014లో మహబూబాబాద్ (ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్‌సీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేశారు. వీరిద్దరూ వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు. ఈ జూలైలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే కాంగ్రెస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకు దక్కుతుందన్న వార్తల నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం స్థానానికి పోటీ చేయాలన్న ఆయన ఆశలు దెబ్బతినడంతో తెల్లం వెంకట్రావ్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు.