Leading News Portal in Telugu

K Laxman: బీజేపీ అధికారంలోకి వస్తే.. నిజమైన చరిత్రకారుల్ని వెలుగులోకి తెస్తాం


K Laxman Interesting Comments On Sardar Papanna Goud: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. నిజమైన చరిత్రకారుల్ని వెలుగులోకి తీసుకొస్తామని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి అని అన్నారు. పాపన్న పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయం కోసం సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బహుజనుల ఆత్మగౌరవ పోరాటానికి ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు. దొరలు, జమీన్‌దారులు, మొగలాయిలను ఓడించిన ధీరుడు పాపన్న అని కొనియాడారు. వృత్తిని అవహేళన చేసిన, అగౌరవంగా వ్యవహరించిన వారిపై తిరుగుబాటు చేశారన్నారు.

Kishan Reddy: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టింది.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

బహుజన ఆత్మీయులతో చిన్నపాటి సైన్యంతో దోపిడీ పాలన అంతం చేసిన గొప్ప చరిత్రకారుడు పాపన్న అని లక్ష్మణ్ ప్రశంసించారు. మొగలాయి సైన్యంను ఓడించి.. భువనగిరి, ఓరుగల్లు, గోల్కొండ స్వాధీనం చేసుకున్న వీరుడు పాపన్న అని చెప్పారు. కుతుబ్ షాహీ, మొఘల్, నిజాం వలస పాలనను ఓడించిన వీరుడని.. అలాంటి చరిత్రను పిల్లలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ బహుజన బిడ్డల చరిత్ర కనుమరుగు చేశారన్నారు. నేతాజీ, భగత్ సింగ్ లాంటి వాళ్ల చరిత్ర కూడా చెరిపేశారన్నారు. బిర్సా ముండా, అల్లూరి లాంటి జాతీయ హీరోలను మోడీ ప్రజలకు గుర్తు చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళ త్యాగాలకు గుర్తింపు లేకుండా.. ఆ నలుగురికీ మాత్రమే గుర్తింపు ఇచ్చారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఆ నలుగురికి పరిమితమైన చరిత్రను.. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ హీరోలను బయటికి తేవాలని కోరారు.

Sajjala Ramakrishna Reddy: అవకాశం ఉన్న అన్నిచోట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైసీపీ పెద్ద పీట వేస్తోంది

బీజేపీ అధికారంలోకి వస్తే.. తాము చరిత్ర కారులను వెలుగులోకి తీసుకొస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ఢిల్లీ వేదికగా మోగులయ్య గౌడ్‌ను గుర్తు చేసుకున్నామన్నారు. కుల వృతుల వారికి సాయంగా ప్రధాని మోడీ విశ్వకర్మ యోజన చేశారన్నారు. శిక్షణ, ఉచిత పరికరాలతో పాటు వారికి లోన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారన్నారు. 13వేల కోట్ల రూపాయలతో 30 లక్షల కుటుంబాలకు మోడీ ఊతమిస్తున్నారని వెల్లడించారు.