Leading News Portal in Telugu

Rekha Nayak : బీఆర్‌ఎస్‌కు షాక్‌.. రేపు కాంగ్రెస్‌లోకి రేఖానాయక్‌


బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ తానే స్వయంగా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బోథ్‌, ఖానాపూర్‌, వైరా, కోరుట్ల, ఉప్పల్‌, ఆసిఫాబాద్‌, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఏడు మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన తెలిపారు. నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్, జనగాం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో ఉంచిన కేసీఆర్‌ తర్వాత ప్రకటిస్తానని వెల్లడించారు. అయితే.. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్‌ స్థానంలో కేటీఆర్‌ సన్నిహితుడు భూక్య జాన్సన్‌కు అవకాశం ఇచ్చింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖా నాయక్‌ స్పందిస్తూ.. ఇంకా 50 రోజుల వరకూ నేను ఎమ్మెల్యేగా ఉంటానన్నారు. మిగిలిన పనులు చేస్తానని, ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఆమె వ్యాఖ్యానించారు. నేను ఇంకా వేరే ఆలోచించ లేదని, లాస్ట్ ఊపిరి వరకు ఖానాపూర్ లో ఉంటానని వ్యాఖ్యలు చేసిన సాయంత్రానికే ఆమె భార్య శ్యాం నాయక్‌ కాంగ్రెస్‌లోకి చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో రేఖానాయక్ భర్త అజ్మీరా శ్యాం నాయక్‌ భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌ రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. అయితే.. రేఖా నాయక్ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

అయితే.. రేఖా నాయక్ 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ జెడ్పీటీసీ మెంబర్ గా పోటీచేసి విజయం సాధించింది. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారిటీతో విజయం సాధించింది. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.