Leading News Portal in Telugu

Young Voters : రాష్ట్రంలో కొత్తగా 4,76,597 మంది యువ ఓటర్లు


తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకు 3.06 కోట్ల మంది ఓటర్లు అర్హులని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వెల్లడించింది. ముసాయిదా ఎన్నికల పాత్రలను విడుదల చేస్తూ సీఈవో వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,06,42,333 మంది ఓటర్లు అర్హులుగా ఉన్నారు. రెండవ స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్) ముసాయిదా రోల్ మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 ఆగస్టు 21న ప్రచురితమైందని, ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 19, 2023 వరకు దాఖలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే.. రాష్ట్రంలో ఇప్పుడు 4,76,597 మంది యువ ఓటర్లు (18-19 ఏళ్ల మధ్య వయస్సు గలవారు) రానున్న ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం 2వ ప్రత్యేక సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్) ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు వికాస్ రాజ్ తెలిపారు. ముసాయిదా జాబితా ప్రకారం, రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333 కాగా అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళా ఓటర్లు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జనవరి 1, 2023 అర్హత తేదీగా ఉన్న మునుపటి SSR 2023 ప్రకారం, జనవరి 5, 2023న ప్రచురించబడిన ఫైనల్ రోల్‌లో 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 8,31,520 మంది చేర్పులు జరిగాయని, రోల్‌ను నిరంతరం అప్‌డేట్ చేయడంతో 1,82,183 మంది ఓటర్లను తొలగించామని సీఈవో తెలిపారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాలు రానున్నాయి.