కాంగ్రెస్ పార్టీపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ పూర్తిగా కుట్ర పూరితమేనని ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రను తెలంగాణ ఎస్సీ, ఎస్టీలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ రాకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని ఆమే అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి మయాల ఫకీర్ లు వస్తారని విమర్శించారు.
గిరిజనులు, దళితులపై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని మంత్రి సత్యవతి రాథోడ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు గిరిజనులకు ఏమి చేసిందని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గే తప్పుడు మనిషి అని.. మయా మాటలు చెప్పవద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రకటించిన దళిత గిరిజన డిక్లరేషన్ ను ఖండిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తప్పు డిక్లరేషన్ ను ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచిందని.. కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ప్రకటించే దమ్ము ఉందా అని అన్నారు.
దళిత డిక్లరేషన్ ను కర్ణాటకలో అమలు చేసి తెలంగాణలో చెప్పాలని మంత్రి సత్యవతి అన్నారు. కర్ణాటకలో ఇచ్చిన ఒక హామీని కూడా అమలు చేయలేదని.. మూడు నెలలకే ఎత్తి వేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను ఎన్ని సార్లు మోసం చేస్తారని మంత్రి దుయ్యబట్టారు. ఇంకా బుద్ధి, సోయి రాలేదా అని మండిపడ్డారు. పది మంది కలిసి తిరిగే పరిస్థితి కాంగ్రెస్ లో ఉందా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైన లక్ష రూపాయలు ఇస్తున్నారా అని మంత్రి సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.