హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ లో మున్నూరు కాపు ప్లీనరి సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా.. ఎంపీ రవిచంద్ర, కాంగ్రెస్ నేత వీహెచ్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బొంతు రామ్మోహన్, మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాజకీయంగా, ఆర్థికంగా అందరం ముందుకు వెళ్ళాలని.. భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని సూచించారు.
తాము సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లి కార్పొరేషన్ అడిగామని.. పది సీట్లు ఇచ్చాడని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అయితే వాటిని గెలిపించుకుని డిమాండ్లను అడుగుదామన్నారు. కాపులపై ఉన్న నమ్మకంతో పది సీట్లు ఇచ్చారని.. డిమాండ్స్ వెంటనే పరిష్కారం అవ్వవని.. సమయం పడుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు నో అనే పదం రాదూ.. కార్పొరేషన్ కూడా వస్తుందని తెలిపారు. కాపు డిమాండ్స్ నెరవేర్చే బాధ్యతను తన భుజాల మీద పెట్టుకుంటున్నాని గంగుల చెప్పారు. తమకు సంఖ్యా బలం ఉందని.. తమ బిడ్డలను తాము గెలిపించుకుంటామన్నారు.
రాష్ట్రం రాకముందు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడలా లేదని మంత్రి గంగుల గుర్తు చేశారు. హైదరాబాద్ కు పని చేసిన ఇద్దరు మేయర్లు కూడా మున్నూరు కాపులేనని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇద్దరు ఆర్టీసీ ఛైర్మన్లు కూడా మున్నూరు కాపులేనన్నారు. జాతిలో పుట్టాం కాబట్టే జాతికి న్యాయం చేస్తున్నామని.. తమకు అవకాశం కల్పించండని మంత్రి కోరారు. కుల వృత్తులను కాపాడాలనే బీసీ బంధు ఇస్తున్నామని తెలిపారు. మున్నూరు కాపులు అందరితో కలిసి ఉంటారని.. బీఆర్ఎస్ పార్టీలో కీలకం మున్నూరు కాపులేనని గంగుల కమలాకర్ అన్నారు.