హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత కనిపించగా.. సాయత్రం నుంచి వాతావరణంలో మార్పు కనిపించింది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, బేగంపేట్, తార్నాక, ఉప్పల్, హిమాయత్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. మరోవైపు రానున్న రెండు గంటల్లో మిగతా ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కామారెడ్డి, జగిత్యాల, మెదక్, మేడ్చల్, మహబూబ్ నగర్, నారాయణ పేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట వికారాబాద్ జిల్లాల్లో వాన పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
గత నెలలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు కురిసిన వర్షాలకు
రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయింది. పలుచోట్ల ఊర్లు కొట్టుకుపోగా.. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అయితే అప్పటినుంచి ఇప్పటి దాకా వర్షాలు పడలేదు. మళ్లీ ఈరోజు పడింది. ఓ వైపు వర్షాలు పడక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే.. చూడటానికే కరువైపోయింది. ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి వర్షాలు పడాలని రైతులు కోరుకుంటున్నారు.