Leading News Portal in Telugu

Harish Rao: మీకే నూకలు చెల్లాయి.. అమిత్ షా వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్


తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని ఖమ్మం సభలో బీఆర్ఎస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ 4జీ పార్టీ, బీఆర్ఎస్ 2జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ అంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు X (గతంలో ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు.

తమకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు. అంతేకాకుండా.. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసునని మంత్రి అన్నారు. ఇలాంటి మీరా కుటుంబ పాలన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని దుయ్యబట్టారు.

ఢిల్లీలో రైతు చట్టాలు నిరసిస్తూ రైతులు ఆందోళన చేస్తే.. బీజేపీ ఏం చేసిందన్న విషయం అందరికి తెలుసంటూ విమర్శలు చేశారు. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీదని బీజేపీపై మండిపడ్డారు. సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని బీజేపీకి హితవు పలికారు.