ఈ సంవత్సరం వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. ఈనెల 19వ తారీఖున సాంప్రదాయబద్దంగా గణేష్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. కాగా, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నేడు (సోమవారం) సమావేశం అయ్యారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలని చాలా మందిలో సందేహం ఉంది. అయితే, ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం చవితి ప్రారంభమై.. 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. కనుకా.. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తామని భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ తెలిపింది.. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా గణేష్ పండగ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
అయితే, గత సంవత్సరం లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రకటించింది. గణేష్ పూజా విధానం తెలిపే బుక్‌తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలిని నిర్ణయించామన్నారు. గణేష్ మండపాలకు పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదు.. స్థానిక పోలీసు స్టేషన్లో చెబితే సరిపోతుంది అని తెలిపారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెడుతున్నారు.. ఇప్పటికే సుప్రీంకోర్టు ఫ్లెక్సీలను నిషేధించింది.. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టవొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చెప్పామని భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రావాలని అడిగినట్టు వారు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయన్నారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి.. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పండుగ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లలో అన్ని మతాల పండుగలను గ్రాంఢ్ గా నిర్వహించామని ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరుపుతాం.. నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తామన్నారు.