తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు, తెలంగాణాకు హరితహారం, దశాబ్ది సంపద వనాలు, గొర్రెల పంపిణి, బీసీ, మైనారిటీలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గృహలక్ష్మి, దళిత బంధు, భూ పట్టాల పంపిణీ, సామాజిక భద్రతా పింఛనులు, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్దీకరణ తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఇటీవల చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో లక్ష్యానికి మించి మొక్కలను నాటడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి అభినందించారు. రాష్ట్రంలో తెలంగాణాకు హరితహారం క్రింద నిర్థారించిన లక్ష్యాన్ని, దశాబ్ది సంపద వనాల క్రింద నిర్దారిత లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. హరిత హారం కింద చేపట్టాల్సిన ప్లాంటేషన్ ను సెప్టెంబర్ రెండవ వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నోటరీ స్థలాల క్రమబద్దీకరణకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన మేరకు జీ.ఓ. 84 ను విడుదల చేయడం జరిగిందని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ పథకానికి దారఖాస్తుల స్వీకరణకై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి.. వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన విచారించి క్రమబద్దీకరణ చేయాలనీ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. జీ.ఓ 59 క్రింద ఇప్పటికీ నోటీసులు అందుకున్న వారి నుంచి రెగ్యులరైజేషన్ కు నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలో కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమారి తెలియజేశారు.