స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం సదస్సులో ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాజయ్య ఉపముఖ్యమంత్రి పదవి పోవడానికి, ఈనాడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరి కారణం అంటూ ఆయన విమర్శించారు. కడియం శ్రీహరి గుంట నక్క లాంటోడు.. అంతకన్నా హీనమైన వ్యక్తి.. అక్కడ దొర కేసీఆర్ అయితే, ఇక్కడ దొర కడియం శ్రీహరి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తాటికొండ రాజయ్య మంత్రి పదవి పోవడానికి పాత్రధారి, సూత్రధారి కడియం శ్రీహరే అని మందకృష్ణ మాదిగ అన్నారు. రాజయ్యను బర్తరఫ్ చేసినప్పుడు కారణం చెప్పలేదు.. రాజయ్యపై చేసింది కేవలం ఆరోపణలు మాత్రమేనని మహిళా కమిషన్ రుజువు చేసింది ఆయన అన్నారు. మాదిగల అస్తిత్వం ఆత్మ గౌరవం మీద దెబ్బ తీసే కుట్ర చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అంటూ మందకృష్ణ ఆరోపించారు. ఎమ్మెల్యే రాజన్నకే మళ్లీ టికెట్ కేటాయించాలని 99 శాతం నేను కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు.
రాజన్నకు మాదిగ జాతి బిడ్డలు అండగా ఉన్నారు అని మందకృష్ణ అన్నారు. ఆరోపణలు నిరూపించి రాజయ్యకు టికెట్ ఇవ్వకు, నిరూపించకపోతే మళ్లీ టికెట్ ఇవ్వు అంటూ ఆయన తెలిపారు. గుంట నక్కలను నమ్ముకున్న కేసీఆర్ కు, దొరల పాలనకు చెక్ పెడతామని ఆయన హెచ్చరించారు. రాజయ్యకు టికెట్ రాకుండా చేయడం మాదిగ జాతి ఆత్మ గౌరవాన్ని కించపరిచేందుకే కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని మందకృష్ణ మాదిగ అన్నారు.