తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. దీంతో రోజు రోజు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని పార్టీల వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 119 స్థానాలకు గానూ 115 స్థానాల్లో బరిలో దిగే అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం తెలంగాణలో అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజాసింగ్ విషయంలో కేంద్రపార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని.. ఎవరితోనీ పొత్తులు ఉండవని ఆయన క్లారిటీ ఇచ్చారు. 119 స్థానాల్లో పోటీచేస్తామని, ఎలక్షన్ కమిటీ వేస్తాం, మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ప్రకటన త్వరలోనే చేస్తామని ఆయన తెలిపారు. రాఖీ కానుకగా సిలెండర్ పై 200 తగ్గింపు సంతోషకరమని ఆయన వ్యాఖ్యానించారు.
విమోచన దినోత్సవం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడుతామని, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తామని ఆయన వెల్లడించారు. మాది క్యాడర్ బేస్డ్ పార్టీ అని, బీఆర్ఎస్ కుటుంబ పార్టీల్లా డైనింగ్ టేబుల్ పై అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించలేమన్నారు. క్యాడర్ తో మాట్లాడిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, ప్రధాని పిలుపు మేరకు పెట్రోల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించి ధరలు తక్కువ చేస్తే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పన్నులను తగ్గించకుండా ప్రజలపై భారం వేసిందని ఆయన మండిపడ్డారు.