వినియోగదారులకు ఉపశమనంగా, రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు కానుకగా 14.2 కిలోల ఎల్‌పిజి వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ₹ 200 తగ్గించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కేంద్రం విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. అయితే.. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 తగ్గించడాన్ని కూడా ఎగతాళి చేస్తున్న కల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. తెలంగాణలో పెట్రో ధరల ఉత్పత్తులకు దేశంలోనే అత్యధికంగా పన్ను వసూలు చేస్తున్న విషయాన్ని మరిచిపోయారా? అని ఆయన అన్నారు.
దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణమున్న రాష్ట్రంగా.. అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలున్న రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని ఓ సారి గుర్తుచేసుకోండని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా.. గతంలో అన్ని రాష్ట్రాలు తమ ప్రజల సౌలభ్యం కోసం పెట్రోఉత్పత్తులపై రాష్ట్రాల పన్నులను కొంతమేర తగ్గించుకున్నాయని, ఒక్క తెలంగాణ రాష్ట్రం తప్ప. బస్సు చార్జీలను పెంచడం, కరెంటు చార్జీలను పెంచడమే తప్ప తగ్గించడం గుర్తుండని మీకు నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదని ఆయన మండిపడ్డారు. గురివింద గింజ రీతిలో తెలంగాణను పాలిస్తున్న మీరే.. బంగారు తెలంగాణ, గుణాత్మకమైన మార్పు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.