రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఇవాళ ఆయన నిర్మల్ జిల్లా కడెంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో తాను కూడా కేసీఆర్ తో ఉద్యమాలలో పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత ఉద్యమకారులను కేసీఆర్ అణచివేశాడని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని, బయట ప్రజలు చూడడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. కుల, విద్యార్థి, ప్రజా సంఘాలు వేలాది మంది వివిధ రూపాల్లో చేపట్టిన ఉద్యమాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. కానీ స్వరాష్ట్రంలో అలాంటి ఉద్యమకారులకు గుర్తింపు దక్కలేదన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు. తమ ఆస్తులు, ఉద్యోగాలు, ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రం కోసం పోరాడిన వారిని సీఎం కేసీఆర్ విస్మరించి నియంతలా పరిపాలన సాగిస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.