దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరుల స్మారకార్థం మేరీ మిట్టీ మేరా దేశ్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అమరుల స్మారకార్థం దేశంలోని లక్షలాది గ్రామాల్లో శాసనాలు ఏర్పాటు చేస్తామని మన్ కీ బాత్‌లో మోడీ వెల్లడించారు. అంతేకాకుండా అమృత్ కలశ్ యాత్రను నిర్వహిస్తామన్నారు. ఇందులో దేశం నలు మూలల నుంచి 7500 కలశాల్లో మట్టిని సేకరించి ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. అయితే.. ఈ క్రమంలోనే నేడు “మేరీ మిట్టి – మేరా దేశ్” కార్యక్రమంలో భాగంగా.. హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భారత ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే రాలే అని వ్యాఖ్యానించారు. వందల సంవత్సరాలు విదేశీ దాష్యాసుంఖలాల విముక్తి కోసం లక్షలాది మంది అసువులు బాసారని ఆయన గుర్తు చేశారు. కొట్లాది మంది జైలు పాలయ్యారని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర త్యాగల గుర్తులుగా ఢిల్లీలో ఒక స్ఫూర్తి వనం ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి గ్రామ, మండలం, పట్టణాల నుండి మేరీ మట్టి మేరీ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈటల రాజేందర్.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ ప్రజలు ఈ దఫా ఓటేయరనే భయంతో కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.బుధవారంనాడు మెదక్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ ఏనాడూ ముఖం చూపించలేదన్నారు. గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కేసీఆర్ లాక్కున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని కేసీఆర్ అమలు చేయలేదని కేసీఆర్ పై ఈటల రాజేందర్ విమర్శలు చేశారు.