జమిలీ ఎన్నికలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు పెట్టాలని కేంద్రం ఆలోచిస్తుందని ఆయన మండిపడ్డారు. మీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమీషన్ కు రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రత్యేకంగా పార్లమెంట్ పెట్టేది జమిలీ ఎన్నికల బిల్ కోసమే అనుకుంటున్నాం.. మాకు అనుమానం వస్తుందని ఆయన అన్నారు. రేపు షెడ్యూల్ ఇచ్చి.. పదిహేను రోజుల్లో ఎన్నికలు అయినా మేము సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో బిల్లు పెడతారు అనే ప్రచారం ఉందని తలసాని అన్నారు. ఏ ఎన్నికలకు అయినా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ఓడిపోతుందనే రిపోర్ట్స్ వాళ్లకు ఉందని.. కాబట్టి అసెంబ్లీ- పార్లమెంట్ కలిపి పెడితే వాళ్లకు లాభం జరుగుతుందనే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలు అని ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికలు జరిపించారన్నారు. జమిలి ఎన్నికలు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తలసాని పేర్కొన్నారు. అంతేకాకుండా.. “వన్ నేషన్ వన్ ఎలక్షన్” అనే నినాదం ఇప్పటిది కాదని ఎప్పటినుంచో మోడీ ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. దేశంలో మోడీ క్రేజీ పడిపోయిందని పేర్కొన్నారు.