Heavy Rain in Telangana State: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించింది.
ఆదివారం నుంచి నిజామాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దాంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్, బోధన్ రోడ్డులోని మాలపల్లి రహదారులు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నిజామాబాద్‌లోని పూలాంగ్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో జిల్లాలోని పలు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో కాల్వలు నిండి రోడ్లపైకి మురుగునీరు చేరడంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీగా వర్షం కురిసింది. సంగారెడ్డిలో వర్షం కురవడంతో ప్రధాన మార్గంలో రోడ్లపైకి వరదనీరు చేరింది. జోగులాంబ గద్వాల జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వరదనీరు కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, మియాపూర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అమీర్‌పేట్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, మెహదీపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో స్కూల్స్, ఆఫీసులకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల వర్షం కురుస్తూనే ఉంది. మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.