ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ఉంది మంచిర్యాల జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత తీరు. ఎమ్మెల్యే సీటు వచ్చేదాక కార్యకర్తలను వాడుకొని.. తీరా గద్దెనెక్కాక కార్యకర్తల ముఖం కూడా చూడలేదు. దీంతో.. మంచిర్యాల కాంగ్రెస్‌లో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏ రాజకీయ పార్టీకైన కార్యకర్తే ముఖ్యం, కార్యకర్తలు లేనిదే పార్టీలు ఉండవు. వారిని సంతృప్తికరంగా ఉన్నంత వరకే ఆయా నాయకులు మనుగడ సాగిస్తారు. కార్యకర్తలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు చేపట్టినా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. అందుకు ఉదాహరణ మంచిర్యాలలో ఓ కాంగ్రెస్ నేత నిర్వాకం చూస్తే అర్ధమవుతుంది. నాలుగున్నరేళ్లు మౌనంగా ఉండి తీరా ఎన్నికల సమయానికి కార్యకర్తలతో సంబంధం లేకుండా, కనీసం వారితో సంప్రదింపులు జరపకుండా చేరికల పేరుతో హడావుడి మొదలుపెట్టారు.
ఇన్నాళ్లు అధికారంలో అనుభవించి తమను ముప్పుతిప్పలు పెట్టిన బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో కార్యకర్తలు ఆ నేతపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు, దాడులు చేయించారు, సామాజికంగా, ఆర్థికంగా పతనావస్థకు నెట్టారు. అటువంటి బీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఏంటనీ సగటు కార్యకర్త సదరు నాయకుడిని నిలదీస్తున్న పరిస్థితి ఏర్పడింది. పార్టీలో చేరికలపై కార్యకర్తలు కోపంగా ఉన్నారని తెలిసే ఆ తంతు మంచిర్యాలలో కాకుండా హైదరాబాద్ లోని గాంధీభవన్ లో పెట్టడంపై కార్యకర్తలు మరింత కోపోద్రుక్కులై పోతున్నారు. ఆ నేత తీరుతో మంచిర్యాల కాంగ్రెస్ కార్యకర్తలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మంచిర్యాల నియోజకవర్గం గట్టెక్కడం కష్టమేనని లోకల్‌లో టాక్ మొదలైంది. ఇప్పడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్‌కు ఇలాంటి నేతలు గండిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి పార్టీ అగ్రనాయకత్వం కష్టపడుతోంటే.. ఇలాంటి నాయకులు పార్టీకే కాకుండా.. అధిష్టానానికి కూడా చెడ్డపేరుతీసుకువస్తున్నారని బాహాటంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.