కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు చెందిన 174 మంది మైనార్టీ లబ్ధిదారులకు బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఇక్కడ రూ.1.74 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 650 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. బీసీ బంధు తరహాలో మైనార్టీలకు ఆర్థికసాయం పథకం ప్రవేశపెట్టడం జరిగిందని, ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రతినెలా పథకం కింద చెక్కులు అందజేస్తామని తెలిపారు. పథకం పారదర్శకంగా అమలవుతుందని, లబ్ధి కోసం ప్రజలు బ్రోకర్లను సంప్రదించవద్దని మంత్రి కోరారు.
పథకం కోసం ఎవరైనా బ్రోకర్లకు లంచం ఇస్తే వారి చెక్కులను వెనక్కి తీసుకుంటామని, లంచం ఇచ్చిన వారిపైనా, తీసుకునే వారిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే.. సీమాంధ్ర పాలకుల తీరుతో 2014కు ముందు ముస్లింల పరిస్థితి కడుదయనీంగా ఉండేదని, సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నారని తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించటంతోనే ఇది సాధ్యమైందన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు ప్రతి ముస్లిం కుటుంబానికి అందేలా చొరవ చూపడంతో అనతికాలంలోనే వారి జీవన పరిస్థితుల్లో పెనుమార్పులు జరిగాయన్నారు. దీనిని జీర్ణించుకోలేని కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.